పుట:Naajeevitayatrat021599mbp.pdf/771

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసు సంస్థ అనే సాగరంలో చెన్నరాష్ట్ర ఒక ద్వీపం అయిపోయింది. అనగా, సంస్థతో సంబంధం తగ్గిపోయినదన్న మాట. గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ఇందుకా మేము పనిచేస్తున్నది? స్వాతంత్ర్య యుద్ధం దాదాపు పూర్తి అయిపోయి, జయము ప్రాప్తించి, మేము ఎక్కిన ఓడ నౌకాశ్రయము చేరే సమయంలో ఒక ద్వీపంగా ఉండిపోవడానికి ఇంక మేము అంగీకరించలేము."

అయితే ఇటువంటి జవాబు చెబుతున్నప్పుడు - ప్రకాశంగారు కాంగ్రెసువాదు లందరిలోనూ ఉత్తమోత్తమ కాంగ్రెసు వాదులనీ, ఉత్తమోత్తమ త్యాగధనులనీ, ఆయన పదకొండు నెలలపాటు నడిపించిన పాలన ఒక్కటి మాత్రమే భారతదేశంలో గాంధీ తత్వానికి అనురూపంగా జరిగిన దన్న దానినీ సుబ్బరాయన్‌గారు, ఆయన ప్రక్కన కూచున్నవారూ గ్రహించలేకపోయారు.

1946 లో సంస్థాపితమై, ఎడతెగని చురుకుదనంతో దాదాపు పదకొండు నెలలు నడచిన ప్రకాశంగారి ప్రజాప్రభుత్వజ్యోతి అలా అవసానము పొందినది

ఆంధ్రప్రాంతంలో, ప్రజలకు - ప్రకాశంగారి ప్రభుత్వ పతన కారకులయిన ఆంధ్ర మంత్రులపైన అమితమైన ఆగ్రహం వచ్చి, అనుకోని పరిణామాలకు దారితీసింది. తెలుగుదేశంలో వారు అడుగుపెట్టిన ప్రతి చోటా వందలకొద్దిమంది ప్రజలు వీరిని చుట్టవేసి, అవాచ్యమైన భాషాప్రయోగాలతో అహింసాదూరమైన కార్యకలాపాలతో వారిని అవమానించారు. కళా వెంకటరావుగారు, బెజవాడ గోపాలరెడ్డిగారు, చంద్రమౌళిగారు ముఖ్యంగా ప్రజల ఆవేశానికి గురి అయ్యారు. నావంటివారి మాటకేమిగానీ, ప్రకాశంగారే ప్రజల కోపాన్ని రెండు మూడు నెలలు తగ్గించలేకపోయారు.

ఏమయినా, తమిళులు కోరిన కార్యం జరిగింది.

ఆంధ్రుల తమ భవిష్యత్తును తాముగానే కొంతకాలం వరకు భ్రష్టం చేసుకోవడం జరిగింది.