పుట:Naajeevitayatrat021599mbp.pdf/764

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే, ఆయన కూచున్న స్థలం అంతకు ముందు మామూలుగా కూచునే స్థలం కాదు. ఆ స్థలం ఆ నెల 22 నాడు మరొక నాయకుని వశమైంది. ఆ రోజు కూచున్న ప్రకాశంగారు దాని కెదురుగా ఉన్న బెంచీపైన కూచున్నారు. అది పదవిలేని శాసన సభ్యులు కూచునే స్థలము. ప్రకాశంగారికి అక్కడినుంచి మాట్లాడడానికి ఏమున్నది?

సభా నిబంధనల ననుసరించి, పదవికి రాజీనామా యిచ్చిన మంత్రులు తాము చెప్పుకొనదలచిన దేదైనా ఉంటే సభా ముఖంగా లోకానికి - తమ మనసులో ఉన్నదీ, పదవి విరమణకు సంబంధించిందీ చెప్పడానికి అవకాశం ఉన్నది. దానిపై చర్చ ఉండదు.

అప్పుడు, తన పదవీ విరమణ గూర్చి చెప్పదలచుకొన్నది ఏదో చెప్పడానికీ, ఆయన తనకు సహజమైన పద్ధతిని మెల్లిగా లేచే సరికి - శాసన సభా ప్రేక్షక భాగంనుంచి చప్పట్లు గట్టిగా బయలు దేరినవి. శాసన సభ్యులు తమ ముందున్న బల్లలపైని చేతులతో గట్టిగా తట్టడం మొదలు పెట్టారు. వారు చప్పట్లు కొట్టరాదని సంప్రదాయము. కాని, తమకు ఇష్టులయినవారు ఎవరైనా మాటాడితే, ఆ మాటలాడ వలసిన అవసరపు ప్రాముఖ్యమునుబట్టి, వారి ఉపన్యాస ప్రారంభమున స్వాగత పూర్వకంగా, సభ్యులు తమ ముందున్న వ్రాతబల్లపై అరచేతులతో కొట్టి చప్పుడు చేయడం అలవాటు. అయితే, ప్రేక్షకులు మాత్రం ఏ విధమయిన చప్పుడు చేయడానికీ వీలులేదు.

అందుచేతనే, ప్రేక్షకుల గాలరీలోనుంచి చప్పట్లు చప్పుడు వినిపించే సరికి స్పీకరు శివషణ్ముగం పిళ్ళైగారు; అధికారం ధ్వనించే కంఠంతో, "ప్రేక్షకుల గాలరీలోనుంచి చప్పుడు వినిపిస్తే, ఇక ప్రేక్షకుల నందర్నీ గాలరీనుంచి అవతలకు పంపించి వేస్తాను!" అన్నారు.

వెంటనే కొంత నిశ్శబ్దత ఏర్పడింది. ఆయన 'తిరిగి ఆ మాటే చెబుతున్నాను,' అని మరొకమాటు చెప్పిన మాటనే చెప్పగా పూర్తిగా నిశ్శబ్దత ఏర్పడింది. ఆ సమయంలో నిశ్శబ్దత అవశ్యకం కదా!

అక్కడ ప్రధాని కూచునే స్థలంలో ప్రకాశంగారంత గాంభీర్యంకలిగి, ప్రజానురాగం పొందిన ప్రధాని ఇది వర కెన్నడూ కూచో