పుట:Naajeevitayatrat021599mbp.pdf/763

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది మొదలు, బడ్జెట్టు చర్చలో పదవీ విరమణ దాకా ఆయన చేసే ఉపన్యాస ధోరణిలో, పదవీచ్యుతి అవుతుందనే బాధగాని, ఆందోళనగాని ఏమీ వ్యక్తం కాలేదు. పార్టీలో ఆయనకు వ్యతిరేకులుగా ఉన్న వారందరు "శుద్ధ గాంధేయులు." కానీ, గాంధీ తత్వానికి కార్యరూపం కల్పించి, నడిపించగలిగిన ప్రకాశంగారు వారికి పనికి రాకపోయారు.

అంత ముఖ్యమయిన కార్యక్రమం మధ్య ప్రకాశంగారున్నప్పుడు నాయకత్వంలో మార్పు తేకూడదని, ఆ గాంధేయులతో గాంధీగారు కూడా అనలేదు. ఇదే మన రాజకీయాలలో విషాద ఘట్టము.

మరి ఒకరు దొరకక పోవడంవల్ల, గాంధీగారి నాయకత్వాన్ని ఈ "గాంధేయులు" ఒప్పుకున్నారు. అంతేకాని, ఆయన సూత్రాలలోగల నూతనమైన ఆర్థిక, సాంఘిక వ్యవస్థా పునర్నిర్మాణంలో వారికేమీ నమ్మకం లేదు. వాటిలో నమ్మకమున్న ప్రకాశంగారు అందుచేతనే వారికి పనికి రాలేదు.

14

ప్రకాశంగారి మంత్రివర్గ అవసానము

1947 మార్చి 25 న మధ్యాహ్నం 12-15 గంటలకు కోటలో ఉన్న శాసన సభలో మాట్లాడడానికి ప్రకాశంగారు తమ స్థలంలో నిల్చున్నారు. ఆ కోట 1630 లో పూనమల్లి వేంకటాద్రి చెన్నప్పనాయకుడు ఇచ్చిన భూమిమీద తూర్పు ఇండియావారు కట్టిన కోట. బ్రిటిషు ప్రభుత్వంవారి స్థాపనను, పెరుగుదలను చూసిన కోట. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించడాన్ని కూడా ఆ కోట చూసింది.

అంతకు పది సంవత్సరాల క్రితం ఆ కోటలో నుంచే ప్రకాశంగారు రెవిన్యూ మంత్రి పదవి వహించి, జమీందారీ తత్త్వాన్ని అణచి ప్రజారాజ్య తత్వానికి అంకురార్పణ చేశారు. ఆ కోటలో నుంచే 1946 లో ముఖ్యమంత్రిగా, మధ్యవర్తుల ప్రాబల్యాన్ని అణచి, స్వయంపోషక గ్రామ స్వరాజ్యానికి బీజాలు వేశారు.