పుట:Naajeevitayatrat021599mbp.pdf/762

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నిక జరుగుతుందని నోటీ సిచ్చారు. అయితే, అంతవరకు, ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉండవలసి వచ్చింది.

ఈ విషయాన్ని గూర్చి ప్రకాశంగారు ఆ నెల 15 వ తేదీన శాసన సభలో ఇలా అన్నారు:

"ఈ రోజున నేను ఎలా ముఖ్యమంత్రిగా నిలుచున్నానో మీకు చెప్పవలసి ఉంది. నేను ఈ ఉద్యోగాన్ని అంటి పెట్టుకొని, వదలకుండా ఉన్నానని ఒక విమర్శ బయలుదేరింది. అయితే, నాకు ఆ ఉద్దేశం లేదు. నిన్న ఉదయం గవర్నరుకు నా రాజీనామా అందజేశాను. ఆయన వెంటనే దాన్ని అంగీకరించలే మన్నారు. ఆయన నాతో - 'మరొకరు మీ పదవి స్వీకరించడానికి ఎన్నుకోబడి తయారుగా లేరు. కాబట్టి మీ రాజీనామా అంగీకరించి నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు 93 వ సెక్షన్ ప్రకారం నేను రాజ్యాధికారం తీసుకోవలసి వస్తుంది. బడ్జెట్టు నేనే సర్టిపై చేయవలసి ఉంటుంది. శాసన సభ్యుల ఆమోదం లేకుండానే అది గవర్నమెంట్ బడ్జట్టే అని దానిమీద నా అనుమతి వ్రాయవలసి ఉంటుంది. ఇది నాకు మనస్కరించడం లేదు. మీ పార్టీ మీటింగు 22 న జరుగుతుంది కాబట్టి, అందులో ముఖ్యమంత్రి ఎన్నిక అయ్యేవరకు, మీరు ముఖ్యమంత్రి పదవి నిర్వహించవలసిం'దని అనడంవల్ల నా కిష్టం లేకపోయినా, ఇక్కడ - ఈ రోజున - మీ ముందు - ముఖ్యమంత్రిగా నిల్చున్నాను.

"93 వ సెక్షన క్రింద గవర్నరు పాలన రాకూడదని కృపలానీగారు కూడా అనుకున్నారు. ఇది ఫిబ్రవరి 28 నుంచి జరిగిన ముచ్చట. అందుచేత బడ్జెట్టు పాసయేవరకు మన సమావేశం సవ్యంగానే జరుగుతుంది. నా పార్టీలో ఉన్న వ్యతిరేకులకూ, నాకూ కార్యక్రమాలపట్ల భేదమేమీ లేదు కాబట్టి, మీరు చేయబోయే చర్చలు, ఉపన్యాసాలు క్రమబద్దమైనవిగానే ఉండగలవు."