పుట:Naajeevitayatrat021599mbp.pdf/761

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరం మధ్యలో ప్రతిపాదించడం పార్టీని బలహీనపరుస్తుందని, అటువంటి ఏర్పాటు మా కార్య నిబంధనలలో చేర్చలేదు.

ఈ పై చెప్పిన భాష్యం ఒక వాక్యంలో సూచిస్తూ, ప్రకాశంగారు ఆ తీర్మానాన్ని రూల్ అవుట్ చేశారు. సమావేశం ముగిసిందని ఆయన ప్రకటించారు. అపుడు, సమావేశంలోంచి ఒకరు లేచి, "మీరు సమావేశం ముగిసిందన్నారు గనుక, మేమంతా కలిసి సమావేశ మౌతున్నా" మన్నారు.

అందుకు ప్రకాశంగారు, "మీరు కూర్చున్నప్పటికీ, కార్య నిబంధనల ప్రకారంగా అది శాసన సభ్య సమావేశం కానేరదు. అక్రమ సమావేశమే అవుతుంది," అన్నారు.

అయితే నేమి, తమలో ఒకరైన రామస్వామి రెడ్డిగారిని ముందుకు తీసుకువచ్చి, ఒక కుర్చీలో కూచోపెట్టారు. ప్రకాశంగారపుడు మరొక మాట కూడా అన్నారు: "సంవత్సరాంతంలో (మార్చి నెలాఖరులో) జరగవలసిన జనరల్ బాడీ (సర్వసభ్య) సమావేశాన్ని కొంత ముందుగానే సమావేశ పరుస్తాను. మీకు కావలసిన నాయకుణ్ణి అప్పుడు ఎన్నుకోండి. ఈ అక్రమమైన తీర్మానం ఎందుకు? అక్రమమైన నాయకుని ఎన్నిక ఎందుకు?"

కాని, వా రది వినలేదు. ఇదంతా జరుగుతున్నపుడు, కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి చెందిన శంకరరావు దేవుగారు అక్కడే మౌనంగా కూచున్నారు. అక్రమంగా జరిగే సమావేశాన్ని వద్దని అయినా ఆయన వారించలేదు.

తరువాత, తప్పు సవరించుకుందామన్న బుద్ధి అధిష్ఠాన వర్గానికి పుట్టినట్టుంది. అఖిల భారత కాంగ్రెసు వర్కింగ్ కమిటీవారు డిల్లీలో సమావేశమై, అధ్యక్షులయిన కృపలానీగారే చెన్నపట్నం వెళ్ళి, కాంగ్రెసు శాసన సభ్యుల సమావేశం జరిపి, క్రొత్తనాయకుని ఎన్నుకోడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆయన మార్చి 10 న చెన్నపట్నం వచ్చారు. 22 న నాయకుని