పుట:Naajeevitayatrat021599mbp.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకటాద్రి నాయకుడు ఇచ్చిన స్థలంలో అతడే అప్పుగా ఇచ్చిన డబ్బుతో కట్టిన కోటకు కలగజేశాయి.

ఆంధ్రులు ఒకమూల ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న సమయంలో, ఈ విధంగా చెన్ననగరాన్ని తెలుగు వాతావరణంలో ముంచివేయడం ఏమి బాగుంది? ఇందుకు కారణం - కామరాజనాడారు గారు, రాజాజీ విడిపోవడమే గదా! కనుక, ఏలాగైనా వా రిద్దరు మనసులు మార్చుకొని ఏకం కాకుంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయేవేళ చెన్నపట్నం ఆంధ్ర పట్నంగా మారిపోతుందనే భయం కలిగి వారిని కలపడానికి సర్వప్రయత్నాలు సాగించారు.

రాజాజీ కేంద్రప్రభుత్వంలో మంత్రి అయినది మొదలు ఈ స్నేహం గట్టిపడింది. కాన్సిట్యుయెంట్ అసెంబ్లీ (సంవిధాన నిర్ణాయక సభ) సమావేశాలు, వీరిరువురూ పదేపదే కలుసుకోడానికి అవకాశాలు కలిగించాయి. రాజాజీ, నాడారుగారలు గడుసువారు గనుక - కళా వెంకటరావు, గోపాలరెడ్డి వర్గాలను, తాము భాషా ద్వేషాలకు అతీతులని అంటూ తమతో కలుపుకున్నారు.

ఈ విధంగా, ప్రకాశంగారికి కాంగ్రెసులోనే ఎదురు పక్షం నెలనెలకూ గట్టిపడింది. చివరికి, వీరికి తోడుగా ప్రకాశంగారి స్కీముల వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న వారంతా ఏకమయ్యారు.

1947 మార్చిలో, పార్టీ మీటింగులో ముప్పైమంది సంతకం పెట్టి, విశ్వాస రాహిత్య తీర్మానాన్ని చర్చించవలెనని నోటీసిచ్చారు. ఫిబ్రవరి 28 న జరిగిన సమావేశంలో ప్రతిపాదించిన ఆ తీర్మానాన్ని ప్రకాశంగారు చదవగానే రూల్ అవుట్ చేశారు. (అనగా, పార్టీ కార్య నిబంధనలకు అటువంటి తీర్మానం ప్రతిపాదించడం వ్యతిరేకమని తీర్పు చేశారు.)

అధ్యక్షునిగాని, కార్యదర్శినిగాని ఎన్నుకొనే పద్ధతి ఉన్న కార్య నిబంధనలలోనే ఆ నిబంధనకూడా ప్రత్యేకంగా వ్రాసి ఉంటే తప్ప విశ్వాస రాహిత్య తీర్మానం ప్రతిపాదించడానికి అవకాశం లేదు. ఏటేటా ఎన్నికైన అధ్యక్షునిపైన విశ్వాస రాహిత్యం అంటూ ఒక తీర్మానం