పుట:Naajeevitayatrat021599mbp.pdf/754

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాఖకు పెద్దగా చేస్తే మనకు లాభిస్తుందని - ప్రభుత్వం ఆయనతో కొన్ని షరతులు కుదుర్చుకొని, డైరక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా నియమించింది. కృష్ణ, గోదావరి డెల్టాల భూసారం విషయంగాను, తంజావూరు డెల్టా భూసారం గురించీ చాలా పరిశోధనలు చేసి, నివేదికలు సమర్పించిన ఉద్యోగి ఆయన.

అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి - రాజపాళయానికి చెందిన టి. ఎస్. కుమారస్వామిరాజా, తరువాత ప్రకాశంగారి మంత్రివర్గ పతన కారకులలో ఒకడు. ఆ తరువాత ప్రకాశంగారిని పడద్రోసిన రామస్వామి రెడ్డిగారిని పడద్రోసి, 1949 లో తానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత 1950 లో ఒరిస్సా గవర్నర్‌గా ఉన్నాడు.

అప్పటి వ్యవసాయ కార్యదర్శి సుందరం అనే ఐ.సి.ఎస్. ఉద్యోగి.

కుమారస్వామిరాజాగారు, చాలా చీటీలను ఉద్యోగుల నియామకం, బదిలీలు, ప్రమోషన్ల విషయంగా ప్రతిరోజూ డాక్టర్ విశ్వనాథ్ గారికి పంపిస్తూ ఉండేవాడు. అది మొదట్లో మా కెవరికీ తెలియదు.

ప్రకాశంగారి గదిలోకి విశ్వనాథ్‌గారు చనువుగా వెళ్ళడము, రావడము సుందరంగారు కనిపెట్టి కోపం తెచ్చుకుంటూండేవారు.

కుమారస్వామిరాజావారు పంపించిన సిఫారసులలో కొన్ని మాత్రమే డాక్టర్ విశ్వనాథ్‌గారు కార్యరూపంలో పెట్టగలిగేవారు. హెచ్చు భాగం త్రోసివేయడంవల్ల కుమారస్వామి రాజాకు కూడా విశ్వనాథ్‌గారిపై ఆగ్రహం పెరుగుతూ వచ్చింది.

ఈ అన్ని కారణాలు కలిపి - ఒక రోజున ఏవో చిల్లర కారణాలుగల ఒక ఆరోపణ డాక్టర్ విశ్వనాథ్‌గారిపై చేసి, ఆయనను డిస్మిస్ చేయవలసిందని సుందరంగారి నోటుపైన, కుమారస్వామి రాజాగారు అంగీకార సూచకంగా సంతకం పెట్టారు.

ఆ ఫైలు ప్రకాశంగారికి వచ్చింది.

అంతకు కొంచెం ముందుగానే ఈ వాసన తగిలి, డాక్టర్ విశ్వనాథ్‌గారు - తనకు కుమారస్వామి రాజాగారు పంపిన సిఫారసు చీటీలు