పుట:Naajeevitayatrat021599mbp.pdf/748

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రణాళికను సాధించి జయం పొందితే, భారతదేశమంతా దాన్ని సాధించి జయం పొందగలిగిందన్న మాటే. తమపైన వ్యతిరేక భావం నాకు లేదని ప్రకాశంగారితో చెప్పు" అన్నారు.

ఈ విషయాలు ఇలా ఉంచి, మరొక విషయంలోకి వెళదాము. 1947 మొదటే పబ్లిక్ సేఫ్టీ ఆక్ట్ పాసు చేయవలసివచ్చింది. దీని నమునా కేంద్రనుంచి వచ్చింది. బిల్లు ప్రవేశపెట్టేముందు ఎవరినైనా ఒకరిని డిటెన్షన్ (కోర్టులో విచారణ జరపకుండా నిర్భంధము)లో ఉంచినట్టయితే, న్యాయా న్యాయాల పరిశీలనకై సలహా సంఘం (ఎడ్వైజరీ కౌన్సిల్) ఏర్పాటు చేయడానికి ఈ బిల్లులో ఒక సెక్షన్ కలిపి ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ విధంగా సలహా సంఘానికి ఏర్పాట్లు ప్రప్రథమంగా చెన్నరాష్ట్రంలోనే జరిగాయి. విదేశీయుల పరిపాలనలో జైళ్ళలో మగ్గిన కాంగ్రెసువాదులకు, ఇతువంటి శాసనం గొంతుకలో పచ్చి వెలగకాయ వంటిది. సెప్టెంబరులో పదవీ స్వీకారం చేసిన కేంద్ర మంత్రివర్గంలో హోమ్‌శాఖామాత్యులైన సర్దార్ వల్లభభాయ్ పటేలుగారు ఈ బిల్లు నమూనా పంపిస్తూ, చెన్నరాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన ప్రకాశంగారికి ఒక ఉత్తరం వ్రాశారు. దాని సారాంశం ఇది.

"రాజ్యపరిపాలన స్వీకరించినవారికి, అనధికారంగా పూర్వం వారు చెప్పిన సూత్రాలు కొన్ని, పరిపాలనా సమయంలో వర్తించవు. అధికారంలో ఉన్నపుడు సంఘ రక్షణ, ఆత్మరక్షణ చేసుకోవలసిన అగత్యం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాన్ని పడద్రోయదలచుకొన్న వారు, సంవిధానమందు (కాన్సిట్యూషన్‌లో) చెప్పిన ప్రజాతంత్రానికి (డెమెక్రాటిక్ ప్రాసెస్‌కు) విరుద్ధంగా ప్రవర్తించినపుడు ప్రజాతంత్ర ప్రాతిపదికపైన నిర్మితములైన శాసనాలు వారి ప్రవర్తనను లొంగదీయడానికి సరిపోవు. సంవిధానానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు అమలులో ఉన్న శాసనాలు చదువుకున్నవారే అయిఉంటారు. పట్టుబడకుండా సంవిధాన వ్యతిరేకమైన (అన్ కాన్‌స్టిట్యూషనల్) పద్దతులు అవలంబించినపుడు, వెంటనే వారిని అదుపులోకి తేవలసిఉంటుంది. అయితే, వారి స్వేచ్ఛ కూడా ప్రధానంగా సంరక్షించవలసిన హక్కే కాబట్టి,