పుట:Naajeevitayatrat021599mbp.pdf/742

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీగారి ప్రశంస

ఇటువంటి పరిస్థితులలో సంవిధాన సభకు ఎన్నికలు జరపవలసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వారు కొందరి పేర్లు పంపించి, వారిని చెన్నరాష్ట్ర శాసన సభవారు ఎన్నుకో వలసిందని సూచించారు. అందులో చాలా మంది నిజంగా గొప్పవారు కాబట్టి, (అందులో ఎస్. రాధాకృష్ణ, అల్లాడి కృష్ణస్వామి అయ్యరు గారల పేర్లు ఉన్నవి.) ఎన్నికలు జరిపించడం అంత కష్టం కాకపోయింది. అయితే, ప్రకాశంగారు - ఈ ఎన్నికయిన వారిలో సామరస్యం కోసం, కాంగ్రెసు పార్టీలో తమకు ఎదురు పక్షం ఉన్నవారికి స్థలాలు వదలి పెట్టడం జరిగింది. అయితే వారు ఎన్నికయిన తర్వాత పదే పదే ఢిల్లీకి వెళ్ళి, అదేపనిగా కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంలో ప్రకాశంగారిమీద చాడీలు చెబుతుండేవారు.

ముఖ్యంగా ఖాదీ స్కీము విషయమై వారు అక్కడ చెప్పగా, ప్రకాశంగారు - తాము అమలు జరుపుతున్న గ్రామ సౌభాగ్య ఉద్యమాలను, ఫిర్కా అభ్యుదయము, ఖాదీ ఉద్యమము, ఉత్పత్తి కొనుగోలు దారుల సహకార ఉద్యమము మొదలైన వాటిని అన్నిటినీ గాంధీగారికి బోధపరచడానికి ఒక అధికారిని పంపించారు. గాంధీగారు వాటిని చూసి, తమ అభిప్రాయ ప్రకారంగానే స్కీములు నడుస్తున్నాయని సంతోషించారు. ఖాదీ విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఆయన ఖాదీ కేంద్రాలలో, ఖాదీ అభివృద్ధి నిరోధకమైన మిల్లులను ప్రకాశంగారు నిషేధించినందుకు ప్రత్యేకంగా అభినంధించారు. ప్రకాశంగారు నడిపిస్తున్న కార్యక్రమం జయప్రదమైతే భారతదేశ మంతటా అవలంబించడానికి మార్గదర్శి కాగలరని గాంధీగారు అన్నారు. ఆయనతో ఆ స్కీము వివరాలు చెబుతున్న ఉద్యోగి - ప్రకాశంగారికి ఇచ్చిన సలహా ప్రకారంగానే, ఆ మరునాడు డిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రధానిగా పదవి స్వీకరిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూగారికి కూడా ఈ స్కీము అమలు పరచవలసిందని సలహా ఇమ్మనగా, గాంధీగారు "ఓయి వెఱ్ఱివాడా! ఇటువంటిది ప్రకాశంగారి వంటివారే చేయగలరు. పండిట్ జీ కాదు,"