పుట:Naajeevitayatrat021599mbp.pdf/732

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో దాదాపు వేయిమందిదాకా కార్యకర్తలు శిక్షణ పొందారు. వరుసగా, ఒకేసారి సంవత్సరం శిక్షణ పొంది, కార్యరంగంలోకి వెళ్ళడం అనే పద్ధతిగాక, మొదటి మూడు నెలలు శిక్షణ, ఆ తర్వాతి మూడు నెలల్లో కార్యరంగంలో పని చేయడం అన్న పద్ధతి ఉండేది. అలా పని చేసివచ్చి తిరిగి రెండోమారు పొందే శిక్షణ మొదటిసారికన్నా హెచ్చుగా ఉండేది. అది కాగానే తిరిగీ కార్యరంగంలో ప్రవేశించేవారు. ఇందువల్ల మొదట సూత్రప్రాయంగా నేర్చుకొన్నది వెంటనే కార్యరంగంలో ప్రక్రియగా అమలు జరిపి, అందులో ఉన్న లోటుపాట్లను రెండోమారు శిక్షణద్వారా సరిదిద్దుకొని సక్రమమైన పనులు చేయడానికి అవకాశం ఉండేది. ఈ శిక్షణ పొందినవారు రోడ్లు నిర్మించడం, నూతులు త్రవ్వడం మొదలైన కార్యాలన్నీ స్వయంగా చేసుకొనేవారు. కూరగాయలు, ఆహారపు దినుసులు పండించేవారు. ఒక క్రమపద్ధతిలో, వారిలో వారే కార్యక్రమాన్ని చర్చించుకొని, ఒకరి భావాలు మరొకరు తెలుసుకొని, కార్యక్రమాలు చక్కజేసుకొనేవారు. రాత్రివేళలలో వయోజన పాఠశాలలు నడిపేవారు. ఈ విధంగా ఒక్క గోపన్నపాలెంలోనేగాక, చుట్టుప్రక్కల గ్రామాలలోను ఒక నూతన చైతన్యం స్వయంపోషకమైన గ్రామ జీవనం ఏర్పాటు చేయడానికి ప్రాతిపదికలు వేశారు.

ఈ కేంద్రంలో హెచ్చు జీతాలు యిచ్చి ప్రొఫెసరులను నియమించలేదు. కానీ, తమ రక్తనాళాలలో దేశభక్తి, ప్రజాసేవ జీర్ణించి ఉన్న మహనీయులు వచ్చి, వారి ప్రత్యేకాభిమాన విషయాలపై ఉద్బోధక ప్రసంగాలు చేశారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు పుస్తక భాండాగార ఉద్యమం, తదనుబంధము లయిన ఉద్యమాలను గురించిన శిక్షణ ఇచ్చేవారు. గొల్లపూడి సీతారామశాస్త్రి గారు గాంధీ తత్వం గురించీ, దానిపై ఆధారపడిన గ్రామ పునర్నిర్మాణం గురించీ చెప్పేవారు. అమరజీవి పొట్టి శ్రీరాములుగారు హరిజనాభ్యుదయ కార్యక్రమాలను గురించి ఉపన్యసించేవారు. వీరు సర్వాంధ్ర ప్రఖ్యాతి గన్న పెద్దలు. వీరికి జీతాలు ఇవ్వవలసివస్తే, వాటి