పుట:Naajeevitayatrat021599mbp.pdf/726

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్టీ మీటింగు ప్రారంభమయి నా పేరు ప్రతిపాదించేసరికి - నాడారు, రాజాజీల వర్గాలవారిలో ఎవరో ఒకరు శివషణ్ముగం పిళ్ళైగారి పేరు ప్రతిపాదించారు.

ఓట్లు తీసుకొని లెక్కించే సమయంలో, కళా వెంకటరావుగారు వచ్చి, నన్ను కౌగిలించుకొని, "నీ పేరు ప్రకాశంగారు మాతో చెప్పనైనా చెప్పలేదు. ఇక్కడ నీకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నట్టు కనిపిస్తున్నది" అని అన్నారు. అందుకు నేను, "పోనీ, నువ్వు చేయగలిగిన సాయమేదో నువ్వు చేయి," అన్నాను. దానికి "అదే చేస్తున్నాను" అని బదులుచెప్పి వెళ్లిపోయాడు. ఆ మాట అర్థం నాకు బాగా తెలుసు. ఆ అర్థం నాకు తెలుసునన్న విషయం అతనికీ తెలుసు.

ఎన్నిక ఫలితం వెల్లడించారు.పిళ్ళైగారు ఒకేఒక ఓటుతో గెలిచారు. ఈ మొదటి ఓటమిని ప్రకాశంగారికి కలిగించామని వ్యతిరేక వర్గాలవారు బాహాటంగా పరస్పర సంతోషాన్ని ప్రకటించుకొన్నారు. మిగిలిన ఉపాధ్యక్ష, శాసన మండలి అధ్యక్షుల ఎన్నిక సందర్భంలో ఎదురుపక్షంవారికి పట్టుదల ఏమీలేదు. వారు అనుకున్న పేర్లే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏర్పాటయినట్టు ఆమోదింపబడతాయని అనుకున్నారు.

ఎగ్జిక్యూటివు నిర్ణయం విశ్వనాథం విషయంలో పార్టీ త్రోసివేసినపుడు, శాసన మండలి అధ్యక్ష పదవికి నటరాజన్‌గారిని ఎందుకు ఆమోదించాలని చిత్తూరుజిల్లానుంచి వచ్చిన బి. రామకృష్ణరాజుగారు - తన పేరు ఎవరిచేతనో ప్రతిపాదింపజేసుకున్నారు. ఒక్కవోటుతో ఆయన గెలిచాడు. రామకృష్ణరాజుగారు ప్రకాశంగారిమీద అభిమానం కలవాడే. కాని, ప్రకాశంగారి అనుయాయులు యావన్మందీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం ప్రకారమే ఓటు చేశా రనుకుంటాను. అందుచేత ప్రకాశంగారికి, పార్టీలో ఏదైనా పట్టుదల వస్తే, సగంమందే తమవైపు ఉన్నట్టు తేలింది. అయితే, ఇది మంత్రివర్గ కార్యకలాపానికి అడ్డురాగూడదనే ధైర్యంతోనే, మిగిలిన కార్యకలాపాన్ని నడిపించేవారు.