పుట:Naajeevitayatrat021599mbp.pdf/725

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయిన శివషణ్ముగంపిళ్ళైగారిని ప్రతిపాదిస్తారేమో నన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో జరిగిన నిర్ణయం ఒక పట్టుదల లేని విషయం అన్నారు.

ఇలా ఉండగా, నాడు పన్నెండు, ఒంటిగంట వేళప్పుడు కామరాజునాడారుగారు, ఫోర్ట్ సెంట్ జార్జిలోని ప్రకాశంగారి గదిలోకి వచ్చారు. అంతకు వారంరోజులక్రితం చెన్నపట్నంనుంచి తంజావూరుకు బదిలీ అయిన ఒక జిల్లా పోలీసు సూపరింటెండెంటు బదిలీ ఆర్డరును ఉత్తర క్షణంలో రద్దు చేయాలని నాడారుగారి కోరిక. మధ్యాహ్నం మీటింగు అయిన తరువాత కాగితాలు తెప్పించి చూస్తానన్నారు ప్రకాశంగారు. మీటింగుముందే ఆ పని జరగాలని నాడారుగారు ఒత్తిడి చేశారు. మీటింగుకు, ఈ కోరికకు ఉన్న సంబంధం ప్రకాశంగారు గ్రహించలేకపోయారు. రుసరుసలాడుతూ, నాడారుగారు పైకి వచ్చేశారు.

అసలు ఆ రోజు జరిగే ఎన్నికలలో - పేరుకు వారికిగాని, వెంకటరావుగారికి గాని వ్యతిరేకత లేదు. ఆ రోజు ఎన్నికలో సూచింపబడే పేర్లలో, నా పేరు ప్రకాశంగారు తనకు ముఖ్యమని అనుకుంటారనీ, అందుచేత తాము ఏకమై నన్ను ఓడించినట్టయితే, నాయకుడుగా ఎన్నుకొనబడ్డ మూడువారాలకే ప్రకాశంగారికి ప్రథమ పరాజయం కలుగుతుందని వారు ఊహించుకున్నారు. శివషణ్ముగం పిళ్ళైగారు - రాజాజీవర్గంలో వారు కావడంచేత, హరిజనులు కావడంచేత ఆయన పేరు ప్రతిపాదించడానికి ఏకమయ్యారు. ఆయన ప్రకాశంగారితో బాగా పరిచయమున్నవారే. 1932 లో ప్రకాశంగారు ఆయనను చెన్నపట్నం నుంచి పూనాకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళారు. ఇటువంటి సంబంధమున్నప్పటికి, ఆయన ప్రకాశంగారిని కలుసుకొని, తనకు స్పీకరుగా ఉండాలనే అభిలాష ఉందని చెప్పలేదు. నేను ఆయనను కలుసుకున్నప్పుడు నాతోకూడా ఈ ప్రసంగం తేలేదు. తెచ్చినట్టయితే ఏమయి ఉండేదో!