పుట:Naajeevitayatrat021599mbp.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థలమునకు కదలుటలోగల ఆంక్షలను తొలగించారు. విశాఖపట్నం ఏజన్సీనుంచి రాజకీయ ఖైదీగా ఉన్న మఱ్ఱి కామయ్యను విడుదల చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అప్పటి గవర్నమెంటు వారు చాలామంది ఉపాధ్యాయుల సర్టిఫికేట్లను కేన్సెల్ చేశారు. కొందరి ఉద్యోగాలు తీసేశారు. ప్రకశాశం మంత్రివర్గంవారు మే 23 న అలా కోల్పోయినవారికి సర్టిఫికేట్లు, ఉద్యోగాలు ఇవ్వడానికి ఆజ్ఞలు జారీ చేశారు.

స్పీకరు ఎన్నిక

ప్రకాశంగారు తమ శాసన సభా పార్టీ కార్య నిర్వాహక వర్గంలో అన్ని వర్గాలవారికి చోటు ఇచ్చారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరులను, శాసన మండలి అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకోవలసిన సమయం వచ్చింది. శాసన సభకు నన్ను స్పీకరుగాను, శ్రీమతి అమ్మన్నరాజాను డిప్యూటీ స్పీకరుగాను; తంజావూరునుంచి వచ్చిన నటరాజన్ అనే అతనిని శాసన మండలి అధ్యక్షునిగాను, దక్షిణ ప్రాంతాలనుంచి వచ్చిన మరొకరిని ఉపాధ్యక్షునిగాను ఉండడానికి కార్యనిర్వాహక సంఘంలో ఏకగ్రీవంగా నిశ్చయించారు.

అయితే, ప్రకాశంగారిని నాయకునిగా ఎన్నుకొన్నది లగాయితూ, ఎదురు వర్గాలవారు, అనగా - కామరాజనాడారుగారు, రాజాజీ, కళా వెంకటరావుగారల వర్గాలు ఏ విధంగా ప్రకాశంగారిని హింసిస్తే బాగుంటుందని అలోచిస్తూనే ఉన్నారు. అందుచేత, స్పీకరు ఎన్నిక సమయంలో ఆ మూడు వర్గాలవారు ఏకమయారు. రాజాజీ వర్గంవారు చాలామంది, నాయకుని ఎన్నికలలో పాల్గొనలేదని ఇదివరలో వ్రాశాను. కానీ, ఇపుడు వారుకూడా వీరితో కలుసుకున్నారు.

నేను ఆ రోజులలో చెన్నపట్నం కాస్మాపాలిటిన్ క్లబ్‌లో బసచేసి ఉండేవాడిని. గోపాలరెడ్డిగారుకూడా అక్కడే బసచేశారు. స్పీకరు ఎన్నిక జరిగేరోజున, ఆ విషయం మా సంభాషణలోకి వచ్చేసరికి, ఆయన - ఎగ్జిక్యూటివ్ కమిటీలో నా పేరు అంగీకరించినట్టు తమకు తెలియదన్నారు. అందుచేత, రాజాజీవర్గంనుంచి - హరిజను