పుట:Naajeevitayatrat021599mbp.pdf/720

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరంలోనూ తెలియజేశారు. అప్పటితో ఆ ప్రసక్తి ఆగింది. కాని, ప్రకాశంగారు నాయకుడుగా నిలబడగూడదన్న పట్టుదల మాత్రం గాంధీగారికి హెచ్చయింది.

ఇటువంటి పరిస్థితులలో, సాధారణ ప్రజల మనసులు అట్టుడికి నట్టు ఉడుకుతుండగా, ఏప్రిల్ 23 నాటి సభలో ప్రకాశంగారి పేరు ప్రతిపాదింపబడింది. తర్వాత మాధవ మేనోన్‌గారు ముత్తురంగ మొదలియారుగారి పేరు ప్రతిపాదించారు. డాక్టర్ పట్టాభిగారి ప్రసక్తి రానేలేదు. అపుడు జరిగిన వోటింగులో, రాజాజీ వర్గంలో ఉన్నవారిలో హరిజనులు తప్ప మరెవరూ పాల్గొనలేదు. ప్రకాశంగారు, గాంధీగారి మాటకు వ్యతిరేకంగా నిలబడడమేగాక, గెలుపుకూడా పొందారు. ధీరోదాత్త నాయకుడని అనిపించుకున్నారు. ఆంధ్రుల హృదయాలను ప్రపుల్లంచేశారు.

మర్నాడు పత్రికలలో వోటింగు భాషానుసారంగా నడచిందని వ్రాశారు కాని, అలాగు జరగలేదు.

ప్రకాశంగారు ఎన్నికయ్యారని గిరిగారు వెల్లడించిన వెంటనే, పంతులుగారు శాసన సభా నాయకుని పీఠం ఎక్కి ఇలా అన్నారు:

"యథేచ్చగా మన ఎన్నికలను మనము జరుపుకోవడానికి అవకాశం కల్పించిన కాంగ్రెసు అధ్యక్షులు ఆజాద్‌గారి రాజకీయ పరిజ్ఞానాన్ని, మనము ప్రశంసించాలి. కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి మన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ క్షణంవరకు మనలో మనకు కలిగిన పరస్పర భేదాలన్నిటిని మనము మరిచి పోవాలి. జయాపజయాలనే భేదపుపలుకులు ఇకమీద ఉండకుండా, మనము యావన్మందిమి ప్రజలయెడల మనకున్న బాధ్యతలను, విధులను 'మనము ప్రజలకు సేవకుల'మని గ్రహించి సక్రమంగా నిర్వహించాలి."

అధిష్ఠానవర్గ ఆగ్రహము

గిరిగారు, ఎన్నిక ఫలితం యథావిధిగా కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి తంతిమూలంగా తెలియజేశారు. వారికెంత ఆగ్రహం వచ్చిందో!