పుట:Naajeevitayatrat021599mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా మనస్తత్వం అంతే! ఆపైన కృష్ణారావు మెట్కాఫ్‌తో ఫిర్యాదు చేశాడు. మెట్కాఫ్ మమ్మల్ని ఇద్దర్నీ ఎదట నిలబెట్టి, "ఏమిటి సమాచారం?" అని అడిగాడు. నేను అక్షరమైన తప్పకుండా వున్నది వున్నట్లుగా చెప్పివేసి, "నాకన్న పెద్దవాడై పైక్లాసు చదువుతూ వుండి మాట పట్టింపు మాత్రానికి నన్ను కొట్టాడు. కనక నాకసి తీర్చుకున్నాను," అన్నాను.

దానిమీద దొర కేమీ తోచలేదు. కృష్ణారావుకేసి చూసి, "దానికేమి చెబుతా?" వని అడిగాడు. పైగా, "నీకు ఏమి శిక్ష వెయ్యమన్నావు?" అని కూడా అడిగాడు. "అది నే నేం చెబుతాను; మీ యిష్టం," అన్నాడు కృష్ణారావు. దొర విచారణ మర్నాటికి వాయిదా వేశాడు. మర్నాడు మెట్కాఫ్, మూడు రోజులు తన ఇంటిదగ్గిర పని చెయ్యడమే శిక్షగా విధించాడు. అది బహు ఆనందదాయకమూ, విద్యాదాయకమూ అయిన శిక్ష! మెట్కాఫ్ బొమ్మూరు మెట్టమీద తను వుండేచోట రాళ్ళు పేర్చి రోడ్డు వేస్తూ వుండేవాడు. ఆ కొండమీద ఎప్పుడూ ఏదో పని చేస్తూ వుండేవాడు. నేను కూడా ఆయనతోబాటు పనిచేశాను. ఆయన పనిచేస్తూ వుంటే అనేక విషయాలు బోధపరుస్తూ వుండేవాడు.

మెట్కాఫ్ దొరకి రాజమహేంద్రవరం అన్నా, తనశిష్యులన్నా చాలా అభిమానం. నేను తరవాత చాలా కాలానికి ఇంగ్లాండు వెళ్ళినప్పుడు ఆవకాయ తీసుకువెళ్ళి ఆయన్ని చూశాను. మెట్కాఫ్ దంపతులు నన్నెంతో ఆదరించి భోజనంపెట్టి పంపించారు. ఆయన ఉండేచోటికి రాజమహేంద్రవరంనించి, వెదురు మొక్కలు తీసుకువెళ్ళి, వాటిని రాజమహేంద్రవరం స్మారక చిహ్నలుగా తనగదిలో పెట్టుకున్నాడు. ఇంకా ఆ గదినిండా రాజమహేంద్రవరం చిహ్నాలు అనేకం వున్నాయి. మెట్కాఫ్ నా యెడల ఎంత శాంతం చూపించేవాడో, నేను ఆయన యెడల అంతస్వేచ్ఛ కనబరచేవాణ్ణి!

ఒకరోజున రాత్రి నాటకంలో వేషంవేసి పొద్దున్నే కాలేజీకి వచ్చాను. హడావిడిగా రావడంలో రాత్రివేషం తాలూకు పౌడరు కొంచెం వుండిపోయింది. అది. పురాణపండ మల్లయ్యశాస్త్రుల్లుగారి క్లాసు.