పుట:Naajeevitayatrat021599mbp.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్శనమయిన తరువాత రాత్రి గాంధీగారు ప్రకాశంగారికి ఒక ఉత్తరం పంపించారు. ఆ ఉత్తరం సారాంశ మిది:

"కోర్టులో న్యాయవాద వృత్తి జరుపుతూ, ప్రకాశంగారు ప్రజాసేవ (పబ్లిక్‌వర్క్) ఎలా చేస్తున్నారని, నేను - ఒరిస్సా నుంచి చెన్నపట్నం హిందీ ప్రచార సభ రజతోత్సవానికి వస్తూండగా, రైలుబండి ఆంధ్రదేశం ప్రవేశించేముందే నాకు స్వాగతం ఇవ్వడానికి వచ్చి నాతోబాటు ప్రయాణం చేసిన రాష్ట్ర కాంగ్రెసు సంఘకార్యదర్శి కళా వెంకటరావుగారిని అడిగాను. మీరు ప్రాక్టీసు మానేశారనీ, ప్రజల సొమ్ము తిని జీవిస్తున్నారనీ ఆయన నాకు చెప్పాడు. [1] మీరు జైలులోంచి విముక్తులయిన తరువాత, బహిరంగ సభలలో ప్రజలు మీకు చందాలిస్తే, ఆ ధనం కాంగ్రెసుకు జమ కట్టక మీరు స్వయంగా వాడుకున్నారట. ఇది చాలా అవినీతికరమైన పని, అందుచేత, మీరు శాసన సభలో ఉండడానికిగాని, నాయకత్వం వహించడానికిగాని వీలులేదు. కాబట్టి, మీరు మీ యత్నం మానుకోవలసినది."

దానిపైన ప్రకాశంగారు ఇచ్చిన ప్రత్యుత్తరపు సారాంశ మిది:

"ఈ దేశంలో ప్రజాసేవ చేసేవారు జీవించడానికి రెండు పద్దతులున్నాయి. ఒకటి - ఎవరైనా గొప్పవారు అభిమానించి ఒక నిధి ఏర్పాటు చేస్తే, ఆ నిధినుంచి వెచ్చాలకు డబ్బు వాడుకునే పద్ధతి. రెండవది - ప్రజాసేవకుడికి ఎప్పటికప్పుడు ఏమి అవసరం వస్తే, దానికి సరిపోయేంత డబ్బు ప్రజలే ఖర్చు పెట్టడమో - లేక నెలకో, సంవత్సరానికో ప్రజలు అభిమానించి ఇచ్చిన డబ్బును ఖర్చు పెట్టే పద్ధతి. నాకు మొన్న వచ్చిన యాభై వేలు ప్రజలు ఈ రెండవ పద్ధతి ప్రకారం ఇచ్చినదే.

  1. 'He is living on public funds' అని వెంకటరావుగారు చెప్పినట్టు గాంధీగారు ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.