పుట:Naajeevitayatrat021599mbp.pdf/716

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారికి అనుకూలంగా 38 వోట్లు, వ్యతిరేకంగా 148 వోట్లు వచ్చాయన్నమాట. ఈ విషయం ఆజాద్‌గారికి, గాంధీగారికి తంతిమూలంగా తెలియజేయడమైనది. ఆ తంతిలో తరువాతి కార్యక్రమం ఏమని సలహా ఇవ్వవలసిందని కూడా ఉంది. మరునాడు తాము తిరిగి సమావేశం అవుతున్నామనీ, ఆ లోపున అధిష్ఠాన వర్గంవారు తమ సలహాను అందచేయవలసిందనీ, ఆ సమావేశ సమయానికి ఏ సలహా అందకుంటే - తమకు తోచిన రీతిని నిర్ణయం తీసుకుంటామని గిరిగారు ఆ తంతిలో వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 20 న మూడవ పర్యాయం తిరిగీ కాంగ్రెసు సభ్యుల సమావేశం జరిగింది. రోజు రోజుకూ సమావేశం పొడిగిస్తున్నందుకు గిరిగారు విచారం వెలిబుచ్చారు. 'అయితే కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని గౌరవించవలె గదా!' అని అన్నారాయన.

అంతటిలో, ఆజాద్‌గారి దగ్గరినుంచి మొదటిదానికన్న వింత అయిన మరి ఒక తంతివార్త వచ్చింది. అందులో, "మీ రిచ్చిన తంతి అందింది. నాయకులుగా ఉండడానికి ఒకరి పేరే సూచించవలెననే నిర్భంధం లేదు. ఎక్కువ పేర్లు సూచించి, మాకు పంపితే, ఏదో ఒక పేరు మే మిక్కడ ఖాయం చేస్తాము," అని ఉంది. ఆ విధంగా చేయడానికి, సంవిధాన సంబంధమైన అభ్యంతరాలు పార్టీలో లేచాయని గిరిగారు ఆజాద్‌గారికి తంతి యిచ్చి, సమావేశాన్ని మళ్ళీ వాయిదా వేశారు. ఏప్రిల్ 21 న నాల్గవ పర్యాయం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంచేత సమావేశం మళ్ళీ వాయిదా పడింది.

ఈ పరిస్థితుల నిలా ఉండనిచ్చి, డిల్లీలో భంగీకాలనీలో ప్రకాశంగారు, నాడారుగారు, మాధవ మేనోన్‌గారు గాంధీగారిని కలుసుకొన్నప్పుడు జరిగిన మరొకటి రెండు విషయాలు ఇక్కడ చెప్పాలి.

రాజాజీ పేరు ఒప్పుకోము అని నాడారుగారు చెప్పగా, పట్టాభిగారి విషయమేమని గాంధీగారు అడిగారట. అందుకు నాడారుగారు, "మీరు స్వయముగా వచ్చి, మనిషి మనిషినీ వోటు అడిగినా ఫలం సందేహాస్పద"మని జవాబిచ్చారట.