పుట:Naajeevitayatrat021599mbp.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశంగారిని నాయకుడుగా ఎన్నుకోవలెననే తీర్మానాలతో, జిల్లా కాంగ్రెసు సంఘాలు తమ ఆమోదాన్ని ప్రకటించాయి, ఆలాగునే కొన్ని కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రకాశంగారికి శాసన సభ నాయకత్వం అప్పజెప్పాలన్న తీర్మానాలు చేసి ప్రకటించాయి.

అడుగడుగునా అడ్డంకులు

ఇలా ఉంటుండగా, ఏప్రిల్ 6 న కాంగ్రెసు అధ్యక్షులయిన మౌలానా అబుల్ కలాం అజాద్‌గారినుంచి, ఏప్రిల్ 7 నాటి సభ ఆపుదల చేయమనీ; ఆంధ్ర తమిళ కేరళ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు ఢిల్లీలో తమ్ము కలుసుకోవలసిందనీ - తంతివార్త వచ్చింది. ప్రజా రాజ్యానికి మొట్టమొదటి మెట్టులోనే హంసపాదు వచ్చింది. ప్రజా రాజ్యం కావాలనే సంస్థ ఈ విధంగా నూతన కార్యపద్ధతిని ప్రారంభించింది. "ఇది చాలా తప్పు. మనం ఢిల్లీ వెళ్ళగూడ"దని నేను ప్రకటించాను. కాని, చెన్నరాష్ట్రంలో ఇతర భాషా ప్రాంతీయులైన కాంగ్రెసు వాదు లుండడంచేతా; వారు మంచి అయినా, చెడు అయినా కూడా కాంగ్రెసు అధిష్ఠాన వర్గాన్ని ఎదుర్కొనే లక్షణం లేనివారు కావడంచేతా; వారితో కలయిక అవసరమూ, కార్యసిద్ధికి మార్గమూ కావడంచేతా ప్రకాశంగారు కూడా మెత్తబడ్డారు.

ఏప్రిల్ 7 న ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు శాసన సభ్యులందరు త్యాగరాయనగరులో సమావేశమయ్యారు. ప్రకాశంగారు - ఆజాద్‌గారి నుంచి వచ్చిన తంతి విషయం ముచ్చటించి, ఆ తంతిలోని ఆదేశాన్ని పటేల్‌గారు కూడా అంగీకరించి ఉన్నారని చెప్పి, ఇంకా ఇలా అన్నారు.

"ఉత్తర ప్రత్యుత్తరాల మూలంగా కన్నా, ముఖాముఖి ఇటువంటి విషయాలు తేల్చుకోవడం మంచిది. భేదాభిప్రాయాలన్నవి ప్రపంచంలో గల అన్ని సంస్థలలోను వస్తూంటాయి. అలాగే, మన చెన్నరాష్టంలో కూడా వచ్చాయి. మానవ సంఘంలో ఇలాంటివి తప్పవు. అయితే, వాటిని సర్దుబాటు చేసుకోవడమన్నది ప్రాజ్ఞుల లక్షణము. ఆంధ్రుల మధ్య, ఇదివరలో పరస్పర భేదాభిప్రాయాలు అనేకసారులు వచ్చాయి.