పుట:Naajeevitayatrat021599mbp.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపూర్ణంగా విజయం సాధించారు. ముస్లిమ్‌లీగుకు ఏర్పాటయిన స్ఠలాలను వారే గెలుచుకున్నారు. నూట నలభైయారు నియోజక వర్గాలలో పై చెప్పినట్టు కాంగ్రెసువారే గెలుచుకున్నారు.

ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులయిన ప్రకాశంగారూ, తమిళ ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కామరాజ్‌నాడారు గారూ, కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె, మాధవమేనోన్‌గారూ అప్పటికి కలసి మెలసి ఏకంగా ఉండేవారు.

ఎన్నికల తరువాత కాంగ్రెసు శాసన సభ్యులు తమ నాయకుని, అనగా కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన ఘట్టం వచ్చింది. లోగడ 1939 లో కాంగ్రెసు మంత్రివర్గాలు రాజీనామా చేసినపుడు, అవసరమైతే శాసన సభ్యులను సమావేశ పరచడానికి కన్వీనరుగా నియమింపబడిన మాజీ పార్లమెంటరీ కార్యదర్శి భక్తవత్సలం గారు, పై ముగ్గురు కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల అనుమతితో, ఏప్రిల్ 7 న హిందీ ప్రచార సభ హాలులో కాంగ్రెసు శాసన సభ్యుల సమావేశం జరుగుతుందని నోటీ సిచ్చారు.

ఈ లోపున, నలుగురు కాంగ్రెసువాదులు చెన్నరాష్ట్ర శాసన సభా నాయకత్వ విషయమై సర్దార్ వల్లభాయి పటేల్‌గారితో చెప్పుకోడానికి బొంబాయి బయలుదేరారు. ఆ నలుగురూ ఆంధ్రులే. ఈ వార్త పత్రికలలో చూసి, నేను ఒక ప్రకటన చేశాను. అందులో "పై విధంగా నలుగురు ఆంధ్రులు పటేలుగారి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ఉండాలి. ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులకు వారెంత మాత్రమూ ప్రతినిధులు కానేరరు. చెన్నరాష్ట్ర శాసన సభ్యులకు స్వేచ్చగా తమ నాయకుని ఎన్నుకొనే హక్కుంది. పరోక్షంగాగాని, అపరోక్షంగాగాని ఎవరైనా వారిని నిర్బంధిస్తే, వారి హక్కులకు భంగం కలుగుతుంది," అని పేర్కొన్నాను. ఇలా ప్రకటించినట్టు నేను ప్రకాశంగారికి చెప్పలేదు.

ఇక్కడి నాయకత్వానికి భంగం కలిగించేందుకు నలుగురు ఆంధ్రులు పటేలుగారి దగ్గరికి వెళ్ళినట్టు వార్త తెలిసేసరికి, వాతావరణంలో ఒక ఉద్రిక్తత ఉద్భవించింది. రాష్ట్రం నాలుగు మూలలనుంచి