పుట:Naajeevitayatrat021599mbp.pdf/704

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1946 లో జనరల్ ఎన్నికలు రానున్నవి. అందుచేత రాజాజీ పైన చెప్పిన సభ్యత్వాన్ని పురస్కరించుకొని తమిళప్రాంతంలో తన వర్గాన్ని బలపరచుకొనడానికి గట్టియత్నం చేశారు. ఇంతకు కొంచెం ముందు, ఎన్నికల తర్వాతి విషయాలకు సంబంధించిన విషయం ఒకటి జరిగింది. కాంగ్రెస్‌వారు తిరిగీ ప్రభుత్వాలు చేపడితే పాత ముఖ్యమంత్రులే తిరిగి ముఖ్య మంత్రులు కాగలరనీ, చెన్నరాష్ట్రంలోకూడా ఆ సూత్రమే వర్తించగలదనీ గాంధీగారంటూ వచ్చారట. ఇదికూడా రాజాజీకి కొంత బలమిచ్చింది. కాని, అందుచేతనే ఆయన యెడల కామరాజ్ నాడారుగారి వ్యతిరేకతకూడా హెచ్చయింది. కనుక రాజాజీకి, నాడారుగారికి - ఈ విషయంలో ఒక రాజీమార్గం కుదిర్చి, రాజాజీకి అగ్రస్థానం కల్పించాలన్న గాంధీగారి సంకల్పాన్ననుసరించి కాంగ్రెసు అధిష్ఠానవర్గంవారు యత్నించసాగారు.

ఆ సమయంలో అంతవరకు జరిగిన పరిస్థితుల కనుగుణంగా ప్రకాశంగారు, కామరాజ్ నాడారుగారికి తమ సంపూర్ణమయిన మద్దతు ఇచ్చారు. తాను రెవిన్యూమంత్రిగా - జమీందారీ ఎంక్వయరీ కమిటీ నివేదిక రచించిన ఉత్తమ పురుషునిగా సంపాదించిన పేరు ప్రతిష్ఠల బలంతో దక్షిణ జిల్లాలలో పర్యటించి, నాడారుగారికి చెప్పుకోదగ్గ సహాయం చేశారు.

కాంగ్రెస్ అధిష్ఠానవర్గంవారు, తమలో ఒకరైన అసఫ్ అలీ గారిని[1] చెన్నపట్నం పంపించారు. రాబోయే ఎన్నికలలో రాజాజీకి గౌరవస్థానం కల్పించడం ఆయన సంకల్పము. చివరకు ఏలాగుననో నాలుగోవంతుకు పైగా, మూడోవంతుకు కొంత తక్కువగా స్థానాలు మాత్రమే - ఆయన వర్గంవారికి ఇవ్వడానికి ఏర్పాటయింది.

రాజాజీని తగ్గించిన ఈ ఏర్పాట్లు, గాంధీగారి మనసుకు ఏమీ సంతృప్తి నిచ్చినట్టు కనిపించదు. కామరాజ్, ప్రకాశంగార్ల మధ్య స్నేహం కుదరడం రాజాజీ భవిషత్తుకు భంగకరం కాబట్టి ఆయనకు అది కూడా నచ్చలేదు. రాజాజీపైన ప్రేమ ఉండడాన్ని సమర్థించవచ్చు.

  1. ఈయన తరువాత ఒరిస్సాకు గవర్నరుగా పనిచేశారు.