పుట:Naajeevitayatrat021599mbp.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'అయితే దైవమే శరణ్యం మన కందరికీ ఇటుపైన,' అన్నారట. తిరిగి వచ్చి శంకరరావు దేవ్‌గారు చెప్పిన మాటలు విని అందరమూ పట్టాభిగారు తన జ్ఞాపకశక్తిని కొంచెం సవరించుకోవలసిందని అన్నాము. "ఇంత జరిగిన తర్వాత విజయవాడలో ఆ విధమైన ఉపన్యాసం మతి ఉన్నవాడు చేయవలసిందేనా?" అని పటేలుగారు కఠోరంగా అన్నారు. అయితే, ప్రకాశంగారు పట్టాభిగారి మీది నింద తొలగించడానికి ఎంతయినా యత్నించారు. ఆ తరువాత కొంతసేపు ఇతర విషయాలు మాట్లాడి మేము బయలుదేరాము.

దీని తుది ఘట్టం - మహాత్మాగాంధీగారి 5-3-45 తేదీనాటి ప్రకటన. అందులో ఆంధ్రా సర్క్యులర్ పూర్వాపరాలు కొన్ని చర్చించి, చివర అది కాంగ్రెసు అనుమతిపైనగాని, తన అనుమతిపైనగాని ప్రకటించబడలేదని ఆయన వక్కాణించారు.

ప్రకాశంగారు ఈ విషయంలో గాంధీగారి పేరు పోకుండా ఉండవలెననే తాపత్రయంతో ఉండేవారు. పట్టాభిగారు 20-7-45 న చేసిన ఒక పత్రికా ప్రకటనను బట్టి - ఆంధ్రా వర్కింగ్ కమిటీ అనుమతి లేకుండానే ఆ కాగితం "ఆంధ్రా సర్క్యులర్" పేర పుట్టిందని తెలిసింది. పట్టాభిగారు తమ ప్రకటనలో "నేను 14-7-1942 నాడు బందరులో ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ సమావేశపరిచాను. (ఆయన ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాడు. బందరు ఆ కమిటీకి హెడ్డాఫీసు కాదు.) 28 మంది కాంగ్రెస్ వాదులు, ఆంధ్రదేశం నలుమూలలనుంచీ హాజరయారు. సర్క్యులరులో ఉన్న సూచనలన్నీ సమావేశం ముందు పెట్టాను. తరువాత బొంబాయిలో జరగబోయే ఆలిండియా కాంగ్రెస్‌కమిటీ సమావేశం తరువాత వాటిని అమలు చెయ్యాలని చెప్పాను," అన్నారు.

ఈ విధంగా ప్రకాశంగారిని త్రోసిరాజనడానికి వ్యక్తిసత్యాగ్రహం తర్వాత వెల్లూరు జైలులో వెంకటరావు, పట్టాభిగారు చేసుకున్న ఏర్పాటు ప్రకారంగా - అధ్యక్షులయిన ప్రకాశంగారికి తెలియకుండా కమిటీ మీటింగు అనడం, మాకు నోటీసు లేదేమని నావంటివాడు