పుట:Naajeevitayatrat021599mbp.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రోగ్రామంతా రోనియో కాఫీలు తీయించి, ఆంధ్రజిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఆంధ్రనుంచి వచ్చిన ఏ.ఐ.సి.సి. సభ్యులకు కవరులోపెట్టి, చిరునామాలు వ్రాసి పోస్టుచేయ నారంభించాడు. నేను అతడు చేస్తున్న పనిచూసి, "ఇదేమిటయ్యా! మన వర్కింగ్ కమిటీగానీ, ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీగానీ, పాస్ చేయని ప్రోగ్రాం ఎందుకు పంపిస్తున్నావు? డాక్టర్ పట్టాభిగారు వర్కింగ్ కమిటీలో ఈ ప్రోగ్రాం ఆలోచించలేదని మూడు నాలుగు రోజులుగా చెపుతూనే ఉన్నారు," అనగా, అందుకు వెంకటరావు, "వారెలాగా పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత నాకు ఉత్తరాలు పోస్టు చేయడానికి టైముండ" దన్నాడు.

ఈ విషయాలు అతనికి జైలులో జ్ఞాపకం చేసినపుడు, "ఏమో, నేను గాంధీ వాదిని," అన్నాడు. ఈ చర్చ అంతా జరుగుతూండగా - మాతో ఉన్న తమిళ, కేరళ, కన్నడిగ సత్యాగ్రహ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ రోజున ఆ సమావేశంలో వచ్చిన వైషమ్యం వారి మధ్య ప్రాణాలు పోయేదాకా ఉండేది. ఆవేళ కళా వెంకటరావు చేసినది - ప్రకాశంగారి నాయకత్వాన్ని పడగొట్టడానికి ప్రథమ యత్నము.

ఈ ఆంధ్రా సర్క్యులర్ వ్యవహారంలో తర్వాతి ఘట్టం గాంధీగారితో సంబంధించింది. ఆగాఖాన్ భవనంలో ఆయనతోబాటు, సరోజినీ నాయుడుగారుకూడా డెటిన్యూగా ఉండేవారు. అయితే, ఆమె ఆరోగ్యం చెడిపోవడంచేత, ఆవిడను తొందరగా విడుదల చేశారు. విడుదల అవుతున్న ఆవిడకు - ఆంధ్రా సర్క్యులర్ అనేది వర్కింగ్ కమిటీవారియొక్కగాని, తనయొక్కగాని అనుజ్ఞపైన పుట్టిన కాగితం కాదని బహిరంగంగా చెప్పవలసిందని గాంధీజీ ఆదేశించారు. విడుదలకాగానే ఆమె అలా ప్రకటించారు. కాని, చాలామంది దానికి ప్రాముఖ్యమివ్వలేదు.

ప్రకాశంగారు అధ్యక్షులు గనుక, అది ఆంధ్రా కమిటీలో పుట్టలేదన్న మాట చెప్పక తప్పలేదు.

దీని తర్వాత ఘట్టం విజయవాడలో జరిగింది. 1945 లో