పుట:Naajeevitayatrat021599mbp.pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందులో ప్రకాశంగారు, వి.వి. గిరిగారు, అనంతశయనం అయ్యంగారు, కళా వెంకటరావు, ఎం. పళ్ళంరాజు, ఎన్. సంజీవరెడ్డి, నేను మొదలైన తెలుగు వాళ్ళము; సత్యమూర్తి, కామరాజనాడార్, ముత్తురంగముదలియార్, భక్తవత్సలం మొదలైన దాక్షిణాత్యులు; కె. మాధవమేనోన్, ఆర్. రాఘవ మేనోన్ మొదలైన కేరళీయులు; కే.ఆర్. కరంత్ మొదలగు కన్నడిగులూ ఉండేవాళ్ళము; మేము ఆ రోజులలో డెటిన్యూల మయినప్పటికి, మొదట్లో మాకు న్యూస్ పేపర్లు ఇచ్చేవారు కారు. పై నుండి వచ్చిన ఇతర రాజకీయ ఖైదీలతో మాకు సంబంధం లేకుండా చేశారు. దేశంలో ఏం జరుగుతున్నదీ తెలిసేది కాదు. మొదట అనుకున్న విప్లవం జరిగిందో, లేదో ఎవరి ఊహాగానాలు వారు చేసుకునేవాళ్ళము. ఒక రోజున, వడ్రంగి పని ఏదో చేస్తూండగా, కొన్ని పెద్ద చప్పుళ్ళు మాకు వినిపించాయి. ఒకమారు గోడలు త్రవ్వుతున్నట్టు శబ్దం వినిపించింది. ఒకమారు పెద్దపెద్ద తలుపులు బ్రద్దలు కొట్టు తున్నట్టు అనిపించింది. మరొకమారు జెయిలు గుమ్మం త్రోసుకువచ్చే ప్రజా సమూహంపైన పేలుస్తున్న తుపాకీల చప్పుళ్ళలాగా వినిపించాయి. దానికితోడు, ఎలాగో జెయిలు అధికారుల కంట బడకుండా ఏ పొట్లానికో కట్టిన వార్తాపత్రికాభాగం ఒకటి లోపలికి సామానుతో వచ్చింది. అందులో రెండు మూడు పెద్ద అక్షరాలు చిరిగిపోయినా, గాంధీగారిని ఆఫ్రికా తీసుకు పోతున్నారన్న వార్తను అక్షరాలు కూడబలుక్కుని గ్రహించాము. విప్లవమేదో జయ మయిందని, జెయిళ్ళ గేట్లను ప్రజలు బ్రద్దలుకొట్టి మమ్మల్ని పైకి తీసుకు పోతారని కొందరు ఊహించారు. కొందరు ఎందుకైనా మంచిది సిద్ధంగా ఉండాలని ఉన్న బట్టలు, సామానులు ఏ క్షణంలో పైకి వెళ్ళిపోతామో అని సర్దుకుని ఉంచుకునే వాళ్ళు.

ఇలా ఉంటూండగా, ఒక డిప్యూటి జెయిలరు పదకొండు గంటల వేళప్పుడు వచ్చి, మమ్మల్ని జెయిలునుంచి అవతలకు వెళ్ళడానికి సామాన్లి సర్దుకోమని, ఒక గంట వ్యవధి యిచ్చి పోయాడు. మాలో కొందరు, మమ్మల్ని ఎక్కడికో బదిలీ చేస్తారని గ్రహించారు.