పుట:Naajeevitayatrat021599mbp.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాంతంలో ఫలించాయని గ్రహించాను. ఆ తొలినాటి రాత్రి విజయవాడ చెన్నపట్నాల మధ్య ఉన్న పదిపన్నెండు రైలు స్టేషన్లను సామానులతో సహా కాల్చివేశారనీ, ఒకటి రెండు చోట్ల నగదుపెట్టెలు (Cash Boxes) కూడా వందలకొద్ది ప్రజలు స్టేషనులోకి దూరి పట్టుకుపోయారనీ, అనేకచోట్ల రైలు పట్టాలను తప్పించారనీ, కొన్నిచోట్ల సిగ్నల్ స్టంభాలను పడగొట్టారనీ వార్తలు తెలిసినవి. మధ్యాహ్నం కావస్తూంది. ఆ సార్జెంటు ఎలాగో నాకు భోజనం తెప్పించి పెట్టించాడు. అన్ని గంటలసేపూ ఆ సెకండుక్లాసు కంపార్టుమెంటు కిటికీలు మాత్రం తెరవనేలేదు. తర్వాత రైలు తిరిగీ నడవడం ఆరంభించింది. గుంతకల్లు మీదుగా చెన్నపట్నానికి ఆ మర్నాడు సాయంకాలానికి చేరుకున్నాము. ప్రయాణ సమయంలో కొంచెం కిటికీలు తీయడం, రైలుస్టేషను సమీపించేసరికి మూసివేయడం యథాప్రకారంగా జరుగుతూనే ఉంది. చెన్నపట్నంనుంచి వెంటనే కాట్పాడికి పోయే మరొక ట్రైనులో నన్ను ఎక్కించి తీసుకుపోయారు. సగంరాత్రి దాటిన తర్వాత కాట్పాడి స్టేషనునుంచి బస్సులో వేలూరు తీసుకువెళ్ళారు. 1940 నవంబరులో వ్యక్తి సత్యాగ్రహంలో నేను అరెస్టు అయినపుడుకూడా అదే పోలీసువానులో, ఆ డ్రైవరే నన్ను స్టేషనునుంచి జైలుకు తీసుకు వెళ్ళాడు. ఒకరి నొకరం జ్ఞాపకం చేసుకున్నాము. వేలూరికి తీసుకువెళ్ళిన తరువాత ఇంకా బాగా తెల్లవారక పోవడంవల్ల నన్నక్కడ ఒక పోలీసు లాకప్‌లోకి తీసుకువెళ్ళాడు. అక్కడున్న సబ్ ఇన్స్‌పెక్టరుతో నేనవర్నో కొంచెం చెప్పుకుని, పైన ఆఫీసు రూములో పడుకోనివ్వమన్నాను. అతడు నా వేషభాషలు చూసి, ఎక్కడికీ పారిపోయేవాణ్ణి కానని గ్రహించి, రెండు ఆఫీసు బల్లలు చేర్చి నాకు చోటు చూపించాడు. అక్కడ నా ప్రక్కవేసుకుని ఆయన దయవల్ల హాయిగా నిద్రపోయాను. ఆ తెల్లవారు జామున, ఇదివరలో నాకు బాగా పరిచయమైన జైలులోకి మూడోమారు ప్రవేశించాను. నేను వెళ్ళేసరికే కొంతమంది మిత్రులు - తెలుగువారు, దాక్షిణాత్యులు, కేరళీయులు అక్కడికి చేరిఉన్నారు. మొత్తం సంఖ్య ముప్పై మందికి కొంచెం మించినది.