పుట:Naajeevitayatrat021599mbp.pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేళకు బెజవాడ చేరాము. విజయవాడలో భోజనం సార్జంటే తెచ్చాడు. భోజనం చేసి నిద్రపోయాను. తెల్లవారుజామున లేచి, సార్జెంటును లేపి, "అయ్యా! సూళ్ళూరుపేట వచ్చిందేమో! ఇడ్లీలు, కాఫీ తెప్పించం"డన్నాను. అంటే, ఆయన, "ఇది సూళ్ళూరుపేట కాదండీ! విజయవాడ స్టేషనే," అన్నాడు. "రాత్రి నన్ను ఇక్కడే అట్టిపెట్టేశారా? ఎందుచేత?' అని అడగ్గా "మిమ్మల్ని అట్టిపెట్టడంకాదు. రాత్రినుంచి రైలు కదలక ఇక్కడే ఉండిపోయింది," అన్నాడు. "అదేమి?" అని నేను ప్రశ్నించగా, "చెప్పడానికి వీలులేదండి," అన్నాడు. ఆశ్చర్యం వేసింది. "అయితే, ఎన్నిగంటలకు బయలుదేరుతా" మని అడిగాను. "అదికూడా చెప్పలేమండి," అన్నాడు. "కిటికీ తలుపులు తెరుస్తారా? ఒకమారు ప్లాట్‌ఫారంవైపు చూస్తా" నన్నాను. అతడు కొంచెం ఆలోచించి, కిటికీ తలుపెత్తి, "రెండు నిమిషాలు మాత్రమే చూడవచ్చు. మళ్ళీ వేసేయాలి, లేకుంటే నాకు మాట వస్తుం," దన్నాడు. అలా, ప్లాట్‌ఫారం మీద చూసేసరికి ఎక్కడో ఒకరిద్దరు మనుష్యులు తప్ప అంతా నిర్మానుష్యంగా ఉంది. నా కంపార్టుమెంటు ఆగినచోటికి ఎదురుగా అల్పాహారాలు, కాఫీ లభించే గది ఉంది. (ఇప్పుడున్న పెద్ద కట్టడంగాని, ప్లాట్‌ఫారం పైన కప్పుగాని అప్పుడు లేదు.) అందులోనూ అట్టేమంది మనుష్యులు కనిపించలేదు. అక్కడికి వచ్చినవారు తిని పారేసిన విస్తరాకులు అన్ని వైపులా ఎగురుతున్నాయి. అవి తీసి, తుడిచే మనుష్యులెవరూ లేరు. సార్జెంటును "రైల్ ఇంజను ఇబ్బందివల్ల ఆగిపోయామా?" అని అడిగాను. చెప్పడానికి వీలు లేదన్నాడు. ఇంతలో బ్రహ్మాండమైన చప్పుడుతో రెండు విమానాలు మా నెత్తి మీదగా పైన వలయాకారంగా రెండు సార్లు తిరిగి, వెళ్ళిపోయాయి. "ఇవేమిటో కనుక్కోండి" అని సార్జెంటుకు చెబితే, సి.ఐ.డీ.లు ఉన్నందున, తాను కదలడానికి వీలులేదన్నాడు. "అయ్యా! ఆకలవుతున్నది. ఇడ్లీ, కాఫీ సంపాదించగలరా?" అని అడిగాను. ఆయన కొంత ప్రయాస పడి తెచ్చి ఇచ్చాడు. బాగా ఎండ ఎక్కనారంభించినట్టు కిటికీ కన్నాలలోంచి కనిపించింది. ఇదంతా చూచి, బొంబాయిలో నేను చూసిన విప్లవ సూచనలు విజయవాడ