పుట:Naajeevitayatrat021599mbp.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయనకు అవి ఒక నూరు దాకా ఇచ్చాను. ఆయన 1930లో నా సత్యాగ్రహ దళంలో జైలుకు వచ్చిన స్వాతంత్ర్య యోధుడు. బొంబాయిలో వర్కింగ్‌కమిటీ మెంబర్లను అరెస్టుచేయడంవల్ల ప్రకాశంగారికి గాని, నాకుగాని అందులో ఎవరితోనూ ఏవిధమైన సంప్రతింపులూ చేసుకునే వీలు చిక్కలేదు. ఇలా ప్రయాణంచేసి నేను ఆగస్టు 13 న విశాఖపట్నం చేరుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి, డిప్యూటి సూపరింటెండెంటు హాజరయి ఉన్నాడు. మీరు చెన్నపట్నం మెయిలుకు వెళ్ళేందుకు సిద్దంగా ఉండండని చెప్పి, ఒకటిన్నరగంట వ్యవధియిచ్చి వెళ్ళిపోయాడు.

క్విట్ ఇండియా ఉద్యమసమయ జైలు జీవితము

'క్విట్ ఇండియా' ఉద్యమం ఆరంభమైన రెండు, మూడు రోజులలోనే దేశం నాలుగు మాలలా కొంత హింసాత్మకమైన విప్లవ కార్యకాండ జరిగింది. గాంధీగారు అరెస్టయిన రోజున బొంబాయిలో జరిగిన సంఘటనలను గురించి ఇదివరలో వ్రాశాను. ఇక మనప్రాంతంలో జరిగిన విషయాలు నాకు స్వయంగ తెలిసినంతవరకు వ్రాస్తాను.

నన్ను ఆగస్టు 13న అరెస్టు చేసినట్టు లోగడ వ్రాశాను. ఆ రోజున సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నన్ను ఒక సార్జెంటు చేతి కప్పజెప్పారు. అతనితోబాటు ఇద్దరు సాయుధులైన పోలీసులను సహాయంగా ఇచ్చారు. తలుపులన్నీ వేసిఉన్న రైలుపెట్టివరకు నన్నొక పోలీసువేనులో తీసుకువెళ్ళారు. నేను వెళ్ళిన పోలీసువాను కిటికీలుగూడా తెరలతో మూసి వేయబడ్డాయి. అందుచేత, నేను పోలీసువానునుంచి కంపార్ట్‌మెంటుకు ఎక్కడం ఎవరో ఒకరిద్దరు మాత్రమే చూసిఉంటారు. నేను ఎక్కిన రైలు - కలకత్తానుంచి చెన్నపట్నం వెళ్ళే మెయిల్ ట్రైను. నాకు అవసరమైన కాఫీ, భోజనం పోలీసు సార్జంటే తెచ్చి పెట్టేవాడు. ట్రెయిను నడపడం ఆరంభమైన తర్వాత నాపై జాలితో కిటికీ తలుపులు తెరిచాడు. కాని, అనకాపల్లి స్టేషన్ సమీపిస్తున్నదనగా తిరిగీ కిటికీలను మూసేశాడు. ఈ విధంగా సాయంకాలం చీకటిపడే