పుట:Naajeevitayatrat021599mbp.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడే బసచేశాను. ఒంటిగంటకు, వర్కింగు కమిటీ సమావేశం నుంచి భోజన విశ్రాంతి వేళకు పట్టాభిగారు తిరిగి వచ్చారు. నేను వెంటనే, "విజయవాడలో నేను చూసిన ప్రోగ్రాం విషయమై వర్కింగు కమిటీలో చర్చ జరిగిందా?" అని అడగ్గా, ఆయన, "లేదయ్యా! ఇదంతా ఎవరు పట్టించుకొంటా రక్కడ? ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడంతోనే కాలమంతా వ్యర్థమైంది" అన్నారు.

ఆ రాత్రి 9, 10 గంటల వేళప్పుడు భరతన్ అనే ఒక ప్రఖ్యాత వార్తాహరుడు పట్టాభిగారికి టెలిపోన్లో, ఆ తెల్లవారుజామున వర్కింగు కమిటీ మెంబర్లను అరెస్టు చేయడానికి ఏర్పా టయినట్టు చెప్పారు. దానిపైన, పట్టాభిగారు వల్లభభాయిపటేలు గారింటికి పోను చేస్తే, పటేలు కుమారుడు ఫోన్ అందుకున్నాడు. అతనితో పట్టాభిగారు తెల్లవారేలోపుగా జరగబోయే వర్కింగ్ కమిటీ మెంబర్ల అరెస్టు సంగతి చెప్పి, పటేలుగారి చొక్కా జేబులో నుంచి తామిచ్చిన రోనియో కాపిని తీసి చింపివేయమని కోరారు. దానికి పటేలు కుమారుడు - అరెస్టులు జరగవనీ, ఏ.ఐ.సి.సి. క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించే వరకు ఎవరినీ అరెస్టు చేయరాదని ప్రభుత్వంవారు నిశ్చయించారనీ చెప్పాడు.

అగ్ర నాయకుల అరెస్టులు

ఆ రాత్రి కానీ, తెల్లవారుజామున కానీ అరెస్టులు జరుగలేదు. 7,8, తేదీల వర్కింగ్ కమిటీ సమావేశాలలో కూడా తమ రోనియో కాపీ ప్రోగ్రాంపై చర్చ జరగలేదని పట్టాభిగారు నాకు మధ్యాహ్నం, రాత్రి కూడ చెప్పారు. 8 వ తేదీ రాత్రి ఏడెనిమిది గంటల వేళ, గాంధీగారు చేసిన చరిత్రాత్మకమైన ఉపన్యాసం తరువాత, "క్విట్ ఇండియా" తీర్మానాన్ని ఏ.ఐ.సి.సి. ఆమోదించింది.

ఆ తెల్లవారుజామున మూడున్నర గంటల వేళ నాగేశ్వరరావు గారి యింటికిద్దరు పోలీసు అధికారులు వచ్చి తలుపు తట్టగా, వారు అరెస్టు చేయడానికి వచ్చారని గుర్తించి, వారిని లోపలికి రమ్మని కూర్చోబెట్టాను. వారు పట్టాభిగారిని మాత్రమే అరెస్టు చేయడానికి వచ్చి