పుట:Naajeevitayatrat021599mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిందిరా!" అని నేను ముందుగా వెళ్ళి బండి దిగమన్నాను. అతను దిగకపోతే ఒంటెద్దుబండి ఎదటకి వెళ్ళి ఎద్దుని విప్పివేసి కాడి పైకి ఎత్తివేశాను. ఆ మనిషి అమాంతంగా లుంగజుట్టుకుని కిందికి జారాడు. వెంటనే చలపతిరావు, జట్టు జనాభా, నేను కలిసి అతన్ని పచ్చడికింద చితకగొట్టాము!

ఇది జరిగింది రాజమహేంద్రవరం తాలూకాకచ్చేరి ఎదట! ఆర్ట్సు కాలేజీకి 100 గజాల దూరంలో వున్న మెయిన్‌రోడ్డుమీద! జనం గుంపులుగా చేరారు గాని, ఎవళ్లూ "ఇదేమి?" టని దగ్గిరికి రాలేదు. గట్టిగా కొట్టివేసిన తరవాత మేము మా దారిని పారిపోయి, గోదావరి ఒడ్డున వున్న పత్రివారి దొడ్లో పడ్డాము. కొందరు మొదట మా వెంట పడ్డారు. కాని చివరికి ఝడిసి చక్కాపోయారు. మేము కొడుతూ వుండగా దుగ్గిరాల కాశీవిశ్వనాధం అనే షావుకారూ (ఆనరరీ బెంచి మేజిస్ట్రీటు), కొరళ్ళు సుబ్బారాయుడూ (టి. డి. పి. కాకినాడ) కలిసి ఫీటన్‌మీద వస్తున్నారు. వాళ్ళుకూడా చూసి చక్కాపోయారు; అంతే!

తరవాత పోలీసులు మా మీద కేసు పెట్టారు. మాదిరెడ్డిచలపతిరావు, నేనూ ముద్దాయిలము. పోలీసులు అన్యాయంగా హనుమంతరావు నాయుడుగారిని కూడా ముద్దాయిగా చేర్చారు. కేసు నడిచింది. నా జీవితంలో తీగెమీద నడిచిన ఘట్టాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఆ చలపతిరావు ప్లీడరే చేస్తూవున్న వెంకటరత్నం నాయుడుగారి తమ్ముడే! అయినా అతనికీ ఈయనికీ పడేదికాదు. అతను తమ్ముడికి యింట్లో భోజనం అయినా పెట్టేవాడు కాడు. అతనికి తన సంఘం తాలూకు బంధువులు అనేకు లున్నారు కాని, ఎవ్వరూ సహాయపడేవాళ్ళే లేక పోయారు. ఎవరి మట్టుకు వాళ్ళే వెనక్కి తీశారు.

ఇక నా సంగతి చెప్పనే అక్కరలేదు కదా! హనుమంతరావు నాయుడుగారి భవిష్యత్తు దానిమీదనే ఆధారపడివుంది. పోలీసులు వార్డు అనే ఒక పెద్దప్లీడర్‌ని పెట్టారు. మా దగ్గిర ప్లీడరు ఫీజు మాట అల్లా వుండగా వకాల్తనామా ఖర్చులకి కూడా డబ్బులేదు. అల్లాంటి స్థితిలో మాకు తోడ్పడింది మంచిరాజు పాపారావు. అతను కేవలం తెలుగు