పుట:Naajeevitayatrat021599mbp.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బరు నెలలో ఆంధ్ర మహాసభ జరిగింది. అప్పటికి నేను తిరుచినాపల్లి కారాగృహంలోని విశాలమైన ఆవరణలో పెద్ద పెద్ద చెట్ల నీడలలో ఏడు, ఎనిమిది మందితో ఉండేవాడిని. ప్రకాశంగారు ఆంధ్ర మహాసభలో అవకాశం తీసుకుని, 'హిందూదేశ విభజన సూత్రం పెద్ద లెవరూ ఆమోదించలేదనీ, గాంధీజీ దానికి సంపూర్ణ వ్యతిరేకులనీ, ప్రజలు అనవసరంగా వైరాశ్యమనే అంధకారంలో పడకూడదు' అనిన్నీ అన్నమాటలు పత్రికలలో పడినాయి. దానివల్ల మాకు కొంత ఉపశమనం కలిగింది.

ఆంధ్రరాష్ట్ర సమస్య

ప్రప్రథమంలో చెన్నపట్నం మొదలైన కొన్ని గ్రామాలను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి, వెంకటాద్రి నాయకుడు పట్టాగా ఇచ్చాడు. చెన్నపట్న మనేది కూవం నదికి ఉత్తరంగా ఉన్న భాగము. ఉత్తర ప్రాంతాలలో ఏవో రెండు వీధులలో తప్ప మిగిలిన ప్రాంతం సంపూర్ణంగా తెలుగు ఖండంగా ఉండేది. 17 వ శతాబ్దంలో ఈ చెన్న పట్నంలో మునిసిపల్ ప్రభుత్వం ఏర్పాటు చేసేటపుడు 212 వీధులుండేవనీ, అవి పూర్తిగా తెలుగు వారితో నిండి ఉండేవనీ అప్పటి రికార్డుల మూలంగా మనకు తెలుస్తున్నది. అయితే, ఈస్టిండియా కంపెనీ వారు సెయింట్ థామస్ మవుంటులో సైన్యస్థావరం ఏర్పరచుకోవడం వల్ల, కోటనుంచి సెయింట్ థామస్ మవుంట్‌దాకా ఇరుప్రక్కలఉండే గ్రామాలను క్రమేణా చెన్నపట్నానికి కలుపుతూ రావడంవల్ల ట్రిప్లికేన్, మైలాపూరు మొదలైన గ్రామాలు ఈ పట్నంలో కలసిపోయినాయి. ఆ గ్రామాలలోని దాక్షిణాత్యులు చెన్నపట్నపు జనాభాలో కలసిపోవడం చేత క్రమేణా తమిళ జనాభావంతు హెచ్చవుతూ వచ్చింది. దానికి తోడు, చెన్నపట్నంనుంచి దక్షిణ జిల్లాలకే మొదట రైలుమార్గం పడింది. అందుచేత దక్షిణజిల్లాల వారికి - చెన్నపట్నానికి రావడానికి, వసతులు తొందరగా కల్పించుకోవడానికి అవకాశాలు కలగడంవల్ల, వారి జనాభా వేగంగా పెరిగింది. ప్రయాణ సౌకర్యాలు హెచ్చడంవల్ల దక్షిణ జిల్లాలలో గవర్నమెంటు కళాశాలలలోనుంచి పాసయిన విద్యార్థులు చాలా