పుట:Naajeevitayatrat021599mbp.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నప్పటికీ, ప్రయాగలో గంగా యమునలు సంగమయిన తర్వాత కూడా కొంతదూరంవరకు తెలుపు తెలుపుగా, నలుపు నలుపుగా ఉండే విధంగా వీరి చరిత్రలు ఉండడంవల్ల రాష్ట్రరాజకీయాలు వీరి వ్యక్తిగత భేదాలకు అతీతం కాలేకపోయాయి. దీనికితోడు అపుడు వేలూరు జెయిలులో ఉన్న డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారికీ, ప్రకాశంగారికీ మధ్యఉన్న విభేదాలు కూడా ఈ పరిస్థితులను, ప్రజలను మరింత చీకటి త్రోవలవెంట పెడుతూండేవి. ఇటువంటి పరిణామమే రాకపోయిఉంటే, వారి విభేదాల విషయమై ఇక్కడ వ్రాయవలసిన అవసరమే లేకపోయి సంతోషజనకమైన స్థితి కలిగి ఉండేది.

వీడ్కొలుపులు - విందులు

కష్టాలలో ఉన్నప్పటికీ సర్దుకొనడానికి అలవాటు పడి, కష్టాల మధ్యనే సుఖ జీవనం చేయడానికి యత్నించడం మానవులకు సహజము. అందులో భారతీయుల కది ఉగ్గుపాలతో పెట్టిన మనస్తత్త్వము. ఆశాపాశములతో సతమత మవుతూ, బంధాలు కల్పించుకొని, ద్వేషరోష వహ్నుల వేడిని రాజనీతి పరిజ్ఞానమని భావించుకొని, భావికాలంలో రాగల పదవులందు గల వ్యామోహమే ప్రాణశక్తిని ఇస్తూండగా కారాగృహ మందున్న సత్యాగ్రహు లందరూ కలసి సోదర సత్యాగ్రహులు ఎవరైనా శిక్షాకాల పరిమితి ముగిసి విడుదల పొందేటప్పుడు కారాగృహ నివాస స్థితిగత సదుపాయాల ననుసరించి, "తేనీటి విందు" ఏర్పాటు చేయడం మామూలయిపోయింది. అలాంటి సమయాలలో విడుదలైన వారిపై ఇష్టమున్న మిత్రులు, పెద్దలు వీడ్కోలు సూచకంగా కొన్ని వాక్యాలు చెప్పడం మామూలయింది. కారాగృహంలోనికి వెళ్ళిన ఆరునెలల తర్వాత ఇటువంటి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ప్రకాశంగారు మాత్రం ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు కారు. అటువంటి ఒకానొక సమయంలో విడుదలయిన కేరళ మిత్రుడొకడు [1] అన్నమాట ఇది: "నేను జైలులోకి రావడమిదే మొదటి

  1. ఈ కేరళ మిత్రు డిప్పుడు కేరళ శాసన సభకు అధ్యక్షుడుగా ఉన్నారు.