పుట:Naajeevitayatrat021599mbp.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చారు. వచ్చి, మరికొందరిని కూడా చూశారు. రాజాజీతో ఆయన ఏమి మాట్లాడారో తెలియదు కాని, తర్వాత హిందూ పత్రికలోను, తక్కిన పత్రికలలోను - జెయిలులో ఉన్న పెద్ద నాయకులకు వ్యక్తి సత్యాగ్రహం నిష్ఫలమయినదన్న భావం కలిగినట్టూ, బ్రిటిషువారు జాతీయప్రభుత్వం ఏర్పాటుచేస్తే, తాము పాల్గొని యుద్ధం జయప్రదంగా సాగించడానికి సాయం చేస్తామని ఆ నాయకులు చెప్పినట్టూ, ఈ అభిప్రాయాలు లిబరల్ లీడరయిన తేజ్‌బహదూర్ సప్రూగారికి తెలియ జేసినట్టూ వార్తలు వెలువడ్డాయి. బ్రిటిషుపార్ల మెంటులో, ఈ కాంగ్రెసు నాయకుల అభిప్రాయాన్నిబట్టి ఏమైనా రాజీ జరుగుతుందా అని ఒక ప్రశ్న అడిగితే, ఇటువంటి మాటలలో తమ ప్రసక్తి లేదని ప్రభుత్వ ప్రతినిధి చెప్పాడు. ఇంతట్లో గాంధీగారు వ్యక్తి సత్యాగ్రహం చేసి జెయిలుకువెళ్ళిన తన అనుయాయులు కొందరికి అందులో నమ్మకం లేదని అన్నట్టు, హిందూ మొదలైన పత్రికలలో పడిన వార్తలనుబట్టి గ్రహించి, ఎవరి పేర్లూ చెప్పకుండా సలహా పూర్వకంగా ఒక ప్రకటన చేశారు. దాని సారాంశం ఇది: "ఎవరికైతే వ్యక్తిసత్యాగ్రహంలో నమ్మకం లేదో, వారు ఆ విషయం వారితో వీరితో అనడంకన్నా, తామున్న జెయిలు సూపరింటెండెంటుకు వ్రాసివేసి నట్టయితే ఆయన వారిని వెంటనే విడుదల చేసే ఏర్పాట్లు చేస్తాడు. కావలసినవారు తమ సమస్యను ఆ విధంగా పరిష్కరించుకొనవచ్చును."

అయితే, కట్టుబాటుకు వ్యతిరేకంగా ఎవరూ అటువంటి అపాలజీ (క్షమాపణ) తో సమానమైన లేఖలు వ్రాసి బయటకు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు.

ఇలా ఉంటూండగా, కొంతకాలానికి ప్రకాశంగారు తమ నాయకత్వధోరణేకాని, తన తర్వాత వారిని ముందుకు తీసుకురారన్న ఒకమాట చెవినుంచి చెవికి ప్రచారమయింది. ముందుకు రాదగ్గ తెలుగు సభ్యులలోకూడా ఈ నిశ్శబ్దప్రచారం కొనసాగింది. సాయంకాలాల వేళ ఆరోగ్యదృష్ట్యా సత్యాగ్రహులు ఆవరణలో నడిచే సమయాలలో తెలుగు సత్యాగ్రహల భుజాలపై తట్టి, "నీవంటి తెలివైనవాడు,