పుట:Naajeevitayatrat021599mbp.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రక్రియ. అయితే, శీఘ్రంగా తిరిగి మంత్రి పదవులలోకి వెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేదనుకున్నవారికి గాంధిగారి మంత్ర రహస్యం అర్థం కావడం కష్టమయింది. "ఈ ఉద్యమం రేపే చప్పబడి పోతుంది" అని రాజాజీ వ్యాఖ్యానించారు. కానీ అది చప్పబడకపోగా, రాబోయే "క్విట్ ఇండియా" మహాసంగ్రామానికి మొదటి మొగ్గరముగా పరిణమించింది.

గాంధిగారు ఇంకొక సూత్రంకూడా చెప్పారు సత్యాగ్రహానికి తాను నియమించే వ్యక్తులు తమకు తోచినట్టు ఉపన్యాసాలేవీ చేయక, తామిచ్చే రెండు వాక్యాలను - ముందుగా అధికారులకు సమయం, స్థలం తెలుపుతూ నోటీసు ఇచ్చి, అక్కడ అప్పుడు చదవాలన్నారు. ఆయన ఆదేశించినట్టు, అవి నిజానికి రెండు వాక్యాలు కాక ఒక వాక్యమే. అది - "ఈ యుద్ధములో బ్రిటిషువారికి మనుష్యులతోగాని, ధనముతోగాని సాయము చేయుట నీతి విరుద్ధము; దోష సహితము." మేమంతా ఈ ఒక్కవాక్యం చదివే సత్యాగ్రహం చేశాము. ఇది బహిరంగ సభలలో జరిగేది. ప్రజలందరికి సత్యాగ్రహ సందేశమిచ్చి, శాసనోల్లంఘనం చేయాలి.

అయితే, దీనికికూడా రాజాజీ వ్యతిరేకియే. ఆయన "ఇదంతా బహిరంగంగా చేయవలసిన అగత్యమేముంది? లాభమేముంది? యుద్ద సంబంధమైన ప్రభుత్వంవారి ఉపసంఘ సభ్యులకు మనం ఎందుకు సహాయం చేయమో వివరిస్తూ ఉత్తరం వ్రాస్తే చాలదా?" అని వాదించారు. గాంధిగారు ఆయన బాధపడలేక, ఆయనను ఒక్కడినే అలా చేసుకోమన్నారు.

కాని, రాజాజీ మాత్రం తనలో ప్రత్యేక విశ్వాసంగల సభ్యులచేత యుద్ధ సంఘ సభ్యులకు దీర్ఘమైన ఉత్తరాలను వ్రాయించారు. తెలుగు రాష్ట్రంలో ఒకరో, ఇద్దరో తప్ప ఆయన మాట ఎవరూ వినలేదు. ఈ విధంగా వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించిన తర్వాత చెన్న రాష్ట్రంలోని వేలూరు, తిరుచినాపల్లి, కోయంబత్తూరు జెయిళ్ళు రోజు రోజుకూ సత్యాగ్రహ్ ఖైదీలతో నిండిపోతూ ఉండేవి. గాంధివారి వద్ద