పుట:Naajeevitayatrat021599mbp.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమావేశ మయింది. గాంధీగారి అహింసా సూత్రానికి భిన్నంగా ఒక తీర్మానం చేసింది. తాత్కాలికంగా కేంద్రంలో జాతీయప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే యుద్ధంలో కాంగ్రెసు మంత్రివర్గాలు బ్రిటిషువారికి, వారి మిత్రులకు సహాయం చేస్తాయని తీర్మానించారు. ఆ మీటింగులో ఈ విషయమై గాంధీకి, రాజాజీకి వివాదం వచ్చింది. గాంధీగారు "మనం మన దృక్పథాలలో ఒకరినుంచి ఒకరం దూరమవుతున్నామని నేను చాలా కాలంనుంచి గ్రహిస్తూ వస్తున్నాను," అని రాజాజీతో అంటే ఆయన, "మీ దృష్టి మందగించిం"దని ఒక విసురు విసిరారు. ఈ వాగ్వివాదం జరుగుతున్నప్పుడు ప్రత్యేకాహ్వానంపైన ఆ సమావేశంలో ప్రకాశంగారు హాజరయి ఉన్నారు. అయితే, చేసిన ఆ తీర్మానం చాలా పొరబాటయినదని ప్రకాశంగారు ఒక బహిరంగ సభలో చెప్పి, మరొక మాటకూడా అన్నారు - "కాంగ్రెస్ కమిటీవారు కొంతకాలంలోనే మోకాళ్ళమీద నిలబడి, నాయకత్వం వహించమని మళ్ళీ గాంధీగారినే ప్రార్థించే పరిస్థితి రాకతప్ప"దని.

ఆగస్టు 8 న పూనాలో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అడిగిన ప్రకారం జాతీయప్రభుత్వం ఏర్పాటుచేయడం సాధ్యంకాదని వైస్రాయి ప్రకటించారు. కావలిస్తే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విస్తృతపరుస్తానన్నారు. అంతేకాని, బాధ్యత అన్నది తన చేతిలోనుంచి జార విడవడం మాత్రం సాధ్యం కాదన్నారు. సెప్టంబరు 12 న ప్రకాశంగారి నాయకత్వంక్రింద గుంతకల్లులో సమావేశమైన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ వైస్రాయి చెప్పినదానికి జవాబుగా దేశవ్యాప్తమైన శాసనోల్లంఘానాన్ని కాంగ్రెసువారు ఆరంభించవలసిందని అఖిల భారత కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి సిఫారసు చేశారు. తరువాత మూడు, నాలుగు రోజులకు కాంగ్రెస్ అధిష్టానవర్గం, అదివరకు జాతీయప్రభుత్వం ఏర్పాటుచేస్తే యుద్ధానికి సాయం చేస్తామని జూలై లో పూనాలో చేసిన వాగ్దానాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి, ప్రకాశంగారు కొన్నాళ్ళ క్రిందట చెప్పినట్లే వారి తప్పును వారే సవరించుకున్నారు. గాంధీగారు "ఆత్మనిగ్రహం అనేది ఆత్మనాశనం క్రింద పరిణమించడానికి వీలు