పుట:Naajeevitayatrat021599mbp.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు మంచివాడయితే సరిపోయేది కదా?" అన్నారు. ఆయన సూచించింది ప్రకాశంగారి విషయము. ఆ విధంగా ఆయన అనేసరికి నాకు ఆశ్చర్యం వేసి, "మీ రెందుకిలా అంటున్నా"రని అడిగాను. దానిపై పట్టాభిగారు "ఒక జమిందారుకి, కోర్టు ఆఫ్ వార్డ్సుకి జరిగిన వివాదంలో ప్రకాశంగారు పాస్‌చేసిన ఆర్డరు సంగతి నువ్వేమంటావు?" అన్నారు. అది విజయనగరం జమీందారుకు సంబంధించినది. ఆ ఫైలు విషయమై తెలిసినవారు రెవిన్యూ సెక్రటరీ, ప్రకాశంగారు, నేను, లా మినిష్టరయిన డాక్టర్ సుబ్బరాయన్‌ గారు మాత్రమే. నాకు ఆ ఫైలుని గురించిన సంపూర్ణ విషయాలు తెలుసు గనుక, ఆ వివరాలు ఆద్యంతం ఆయనకు చెప్పి, "దీనిపైన మీరే ఆర్డరు వేయవలసివస్తే ప్రకాశంగారు వేసినట్లుకాక వేరుగా వేయగలరా?" అని ప్రశ్నించాను. దానిపైన ఆయన, "ఈ సంగతులన్నీ మాకు సరిగ్గా చెప్పేవా డెవడున్నాడయ్యా?" అన్నారు.

'మాకు' అంటే కాంగ్రెస్ కమిటీ పెద్దలకు అన్నమాట.

"ఉన్న సంగతులు చెప్పే వా రెవరున్నారని మీ రడుగుతున్నారు. లేని సంగతులను ఉన్నట్లు మీకు చెప్పిన వా రెవరో చెప్తారా? పోనీ, ఒకవేళ అనుమానం వస్తే ప్రకాశంగారిని కనుక్కోగూడదా? కాకుంటే, నన్నడగరాదా? ఏమీ లేకుండానే ఒక మహావ్యక్తి పైన ఇటువంటి అనుమానాలు మీలో మీరు పెంచుకోవడం మంచిదా?" అన్నాను.

అందుకు, "విశ్వనాథం! నువ్వింకా చిన్నవాడివి. లోకంలో అనేక సంగతులు జరుగుతాయి. నీకు తెలీదు," అన్నాడు ఆయన. అది విని నా కాశ్చర్యం వేసి వివరాలు మళ్ళీ చెప్పవలసిందని రెట్టించగా, ఆయన "సరైన ఆర్డరు పాస్ చేయడానికి కొంతమంది డబ్బు పుచ్చుకుంటా రన్నది నీకు తెలీదులే," అని పూచీ పేచీలేని పద్ధతిలో మాట విసిరేశారు.

బేసబబైన మాటలకు వారి మాటే పరాకాష్ఠగా కన్పించింది నాకు.

అది మొదలు, వారితో సంభాషణ నేను వీలైనంత మట్టుకు