పుట:Naajeevitayatrat021599mbp.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభ ఏమో బహిరంగ స్థలంలోనే జరగడానికి ఏర్పాటు జరిగింది. అయితే, దురదృష్ట వశాత్తు మధ్యాహ్నం రెండు గంటలవేళ అయ్యేసరికి మేఘాలు దట్టంగా కమ్మి, కుండలతో దిమ్మరించి నట్టు వర్షం పడసాగింది. తడవకుండా ఉందామనే ఆశతో, కొందరు వేదికపై నున్న తివాసీల క్రింద జంబుకానాల క్రింద ప్రవేశించారు. అయితే ఆ రక్షణ వారికి ఒక పదినిమిషాలు మాత్రమే కలిగింది. తర్వాత ఆ పెద్ద పెద్ద తివాసీలు, జంబుకానాలు కూడా పూర్తిగా తడిసి బరు వెక్కడంతో, వాటి క్రింద ఉక్కిరి బిక్కిరి అవుతున్న వారిని ఎలాగో కష్టంమీద పైకి లాగవలసి వచ్చింది. అందులో చాలామంది అప్పు డలా చాలాసేపు తడవడంవల్ల జబ్బు పడ్డారు. చెన్నరాష్ట్రంలో పబ్లిక్ వర్క్స్‌మంత్రిగా పనిచేసిన యాకూబ్ హుసేన్‌గారు అలా తడియగా చేసిన జలుబు న్యూమోనియా క్రిందికి మారగా, జబ్బుపడి, చెన్నపట్నానికి తిరిగి వచ్చిన కొంత కాలానికి దివంగతులయ్యారు.

ఈ కాంగ్రెస్ పూర్తి అయిన తర్వాత నేను, డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు కలసి తిరుగు ప్రయాణం చేయడం సంభవించింది. ఆయనపై నాకు అపారమైన గౌరవ ముండేది. ఆంధ్ర ఉద్యమం ప్రారంభకాలంలో ఆయన మహానాయకత్వాన్ని వహించారు. నిశితమైన విమర్శనా శక్తి, వాడియైన వాగ్ధాటి గల ఆయన కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంలో కొంతవరకు గాంధీగారికి ఆప్తుడు. 1935 లో కాంగ్రెస్ స్వర్ణోత్సవ సమయంలో కాంగ్రెస్ చరిత్రనంతా ఒక ఉద్గ్రంథంగా వ్రాసి ప్రశంసలు పొందారు ఆయన. అయితే, ఆయనకు మొదటినుంచీ ప్రకాశంగారంటే కొంచెం ద్వేషం, మాత్సర్యం ఉండేవి. అవి అనేక సమయాలలో బయల్పడుతూ ఉండేవి. కబుర్ల ధోరణిలో, చెన్నరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగు నడచిందో అని ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబుగా, రాజాజీ ఐ. సి. యస్. ఉద్యోగుల చెప్పుచేతలలో ఉండేవారనీ, తాను ఎంచుకున్న మంత్రివర్గంపై అట్టే నమ్మకం కనబర్చేవారు కారనీ నేను సోదాహరణంగా చెప్పగా, సీతారామయ్యగారు "నువ్వు చెప్పిందంతా బాగుందయ్యా? అసలు మన