పుట:Naajeevitayatrat021599mbp.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసు ఆయన నాయకత్వం క్రింద నడుస్తున్నది కదా! అందుచేత, ఆగస్టు మొదటి వారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై, భారత దేశాన్ని ఐరోపా సంగ్రామంలోకి దించగూడదని తీర్మానం చేసింది. దీనికి జవాబుగా 3 - 9 - 1939 నాడు, బ్రిటిషు రాజప్రతినిధి భారత దేశం యుద్ధంలో ఇంగ్లండు పక్షాన చేరినట్లుగా ఒక ప్రకటన చేశాడు. అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీవారు, గాంధీగారి అహింసా తత్వం అటుంచి, వారం రోజులపాటు చర్చజేసి, ఆ నెల 14 వ తేదీన భారతదేశాన్ని స్వతంత్రమైన దేశం క్రింద గౌరవిస్తూ ఇంగ్లండు ప్రభుత్వంవారు తమ యుద్ధోద్దేశాలను ప్రకటించినట్లయితే వారికి సాయం చేస్తామని తీర్మానించారు. గాంధీగారిని కాదని ఈ విధంగా తీర్మానిస్తే, బ్రిటిషువారు కాంగ్రెస్ అభిప్రాయాన్నే గౌరవిస్తారని కాంగ్రెస్ వారనుకున్నారు. అయితే, బ్రిటిషువారు ఈ తీర్మానానికి ఎట్టి విలువా ఇవ్వలేదు. 22 - 10 - 39 న కాంగ్రెస్ కమిటీ తిరిగీ సమావేశమై, ఆత్మ పరీక్ష చేసుకుని, బ్రిటీష్‌వారికి యుద్ధంలో సహాయం చేయకూడదనీ, కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామా చేయాలనీ ఆదేశించారు. దాని ప్రకారం 26 - 10 - 39 నాడు చెన్నపట్నంలో, శాసన సభలో మంత్రివర్గం రాజీనామా చేయాలని ప్రతిపాదించిన తీర్మానం అంగీకరింపబడింది. 29 వ తేదీన రాజాజీ మంత్రివర్గం రాజీనామా పత్రం గవర్నరుకి అందజేశారు. ఆ రోజే హోల్డ్సువర్త్ అనే రెవిన్యూ కార్యదర్శి ప్రకాశంగారి గదికి వచ్చి, బాగా నడుస్తున్న మినిస్ట్రీ రాజీనామా చేయడం అంత వ్యవహార జ్ఞానంతో కూడిన పని కాదని సానుభూతి పరంగా అన్నాడు. ప్రకాశంగారి కేమో జమీందారీ బిల్లు పాసు కాకుండా రాజీనామా ఇవ్వడం ఇష్టంలేదు. కాని, ఆ రాజీనామా ఇవ్వడం మంచిదే అని పైకి కార్యదర్శితో అన్నారు. రాజీనామా ఇవ్వపోయినట్లయితే - గవర్నరు కాన్ట్సిట్యూషనల్ గవర్నరుగా మాత్రం ఉండి, మంత్రుల సలహా ప్రకారం నడుస్తానని ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకో గలడు? యుద్ధానికి మన రాష్ట్రంలోంచి ఏ విధమైన సాయమూ చేయమని మంత్రివర్గం చెప్పినమాట ఎలా నిలబడు