పుట:Naajeevitayatrat021599mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింగితం అబ్బాయి మేనల్లుడు గోపాలకృష్ణుడు ఫ్రీటిక్కెట్టు ఇవ్వాలని అడిగాడు. ఆయన ఫ్రీటిక్కెట్టు ఇవ్వలేదు. దాంతో అతను అబ్బాయి దగ్గిరికి వెళ్ళి "చూశావా! నీ శిష్యులు వెంకటరత్నం వగైరాలని అసరా చేసుకుని నిన్ను తోసివేశా,"రని పురి ఎక్కించాడు. అబ్బాయి సాధారణంగా అరుగు దిగకుండానే ఈ తాలింఖానా జనాభా నంతనీ స్వాధీనంలో వుంచుకునేవాడని ప్రతీతి. మనిషి అకారణంగా తొందరపడే స్వభావం కలవాడు కాడని కూడా చెప్పేవారు. అయితే, తన మేనల్లుడు వచ్చి పురి ఎక్కించేటప్పటికి అతను కొంచెం తొందరపడ్డాడు.

మర్నాడు మా నాటకం హాలుమీద రాళ్ళు పడ్డాయి. మా వద్దీలో వున్న ఈ తాడి వెంకటరత్నం వగైరాలు బయటికి వచ్చి, రాళ్ళువేసే వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుపడ్డ వాళ్ళలో ఈ గోపాలకృష్ణుడున్నాడు. వాళ్ళతో కొంత కొట్లాట జరిగింది. ఆ పైన ఆ గోపాలకృష్ణుడు మేనమామతో చెప్పుకోగా అతను కదిలి వచ్చాడు. వెంటనే మా పెండాలు మీదికి, మేము వున్న యింటి మీదికీ ఆ అబ్బాయిసేన కదిలి వచ్చింది. మేము తలుపులన్నీ వేసుకుని లోపల కూర్చున్నాము. యనమండ్ర కొండయ్య అనే అతను ఇల్లెక్కి వచ్చి చీకట్లో మేడమీద కిటికిలో కూర్చున్న నన్ను ఒక్క దెబ్బ తీశాడు. అదృష్టవశాత్తు ఆ దెబ్బ కొంచెం ఊచకి దూసుకుపోవడంచేత నాకు గట్టిగా తగలలేదు కాని, లేకపోతే మూతి పగలవలసిందే!

ఈ దెబ్బతో బాగా పౌరుషాలు రేగాయి. "మా సహాయం లేకుండా నాటకా లాడతారా!" అని అబ్బాయి పార్టీవాళ్ళూ, "మే ముండగా మీ కేమీ పరవాలే"దని తాడి వెంకటరత్నం ముఠావాళ్ళూ చెలరేగారు. మా నాయుడుగారికి బాగా పౌరుషం వచ్చింది. ఆయన అల్లరి చేస్తే ఝడిసి వెళ్ళిపోతామా! నాటకాలు ఆడవలసిందే!" అని నిర్ణయించారు. ఇల్లాంటి విషయాల్లో నాయుడుగారు చాలా పట్టుదల మనిషి. మొత్తంమీద బందోబస్తుతో నాటకాలు ఆడాము; అది అంతటితో ఆగలేదు. "విచ్చలవిడిగా ఊరేగుతాము" అనే ప్రగల్బాలు