పుట:Naajeevitayatrat021599mbp.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆపారు. ఏ రుక్మిణమ్మగారు రాజకీయ శిక్ష అనుభవించడం ఆ నాడు లక్ష్మీపతిగారికి డబ్బు మంజూరు కాకుండా చేసిందో, ఆ రుక్మిణమ్మగారే ఇప్పుడు మనకు డిప్యూటి స్పీకరు అయ్యారు గదా! అందుచేత మీ సూత్రప్రకారం మీరు పునరాలోచించవలసిం"దని చెప్పాను. డిస్పాచ్ గుమాస్తా పెట్టిన పేచీని గ్రహించి ఆయన ప్రకాశంగారితో ఏకీభవిస్తూ, ఏడువేలు లక్ష్మీపతిగారి కివ్వాలని ఒప్పుకున్నారు. కాని, యీ నిర్ణయానికి వచ్చేలోపున చాలా రాద్ధాంత సిద్ధాంతాలు ప్రకాశంగారు, రాజాజీ, డాక్టర్ లక్ష్మీపతీగార్లమద్య జరిగి, పేరు ప్రఖ్యాతులు గన్న డాక్టర్ లక్ష్మీపతిగారు రాజాజీ గుమ్మందగ్గర సత్యాగ్రహం ప్రారంభం చేసేవరకు వెళ్ళింది. కాని, ఎవరికీ ఇబ్బందిలేకుండా సత్యాగ్రహం ఆరంభించకముందే డబ్బు మంజూరు కావడంవల్ల ఆ వివాదం అంతటితో పరిష్కారమయింది.

హిందీ

ఇప్పుడు హిందీ భాష విషయంలో ప్రబలిన వ్యతిరేకాభిప్రాయాలు, 1937 లో మంత్రివర్గం ఏర్పాటయిన సందర్భంలో ఇంత తీవ్రంగా లేవు. జస్టిస్‌పార్టీ నాయకులు మాత్రమే దానికి వ్యతిరేకమైన ఆందోళన ప్రారంభించారు. దీనికి కారణం వారికి కాంగ్రెసుమీదనున్న వ్యతిరేకతయే. ధైర్యంగా అన్ని స్కూళ్ళలోను ఆనాడే హిందీ నేర్పడం ఆరంభిస్తే ఎలా ఉండేదో తెలియదు. ఎప్పుడయితే కొన్ని స్కూళ్లలో మాత్రం ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారో అప్పుడే వ్యతిరేకులకు బలము, ధైర్యము హెచ్చవడంలో ఆశ్చర్యంలేదు. పనిపాటలులేని కొందరు చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను చేరదీసి, అందులోఅనేకులకు రోజుకింత అని కొంతకూలికూడా యిచ్చి హిందీ చెప్పే స్కూళ్ళ ఆవరణల్లోకి వెళ్ళి రాళ్ళు వేయడం, అసభ్యంగా కేకలు వేయడం మొదలైన అల్లరులు చేయించడం ఆరంబించారు. శాసన సభలో జస్టిస్ పార్టీ నాయకులు వాళ్ళకు బలం చేకూర్చేవారు.

అది అక్కడితో ఆగలేదు. రాజాజీ వసతిగృహానికి చుట్టూ బాగా ముష్కరులైన పెద్దలతోబాటు, పిల్లలు అనేకులుచేరి, రాళ్ళు రువ్వి