పుట:Naajeevitayatrat021599mbp.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడువేల రూపాయలు మంజూరు చేసే ఆర్డరును తాను పంపవచ్చునో, పంపరాదో అన్న అనుమానము కల్గి, సందేహ నివారణార్థం విజ్ఞప్తి పంపుకుంటున్నానని వ్రాసి మీదకు పంపినాడు. ఆ కాగితం హోము మంత్రివరకు ప్రయాణమై ఆ మొత్తాన్ని మంజూరు చేసిన ఆరోగ్యమంత్రితో సంబంధం లేకుండా ఆయన జారీచేసిన ఆర్డరు నిలిపివేశారు.

1937 లో మంత్రివర్గం ఏర్పాటయిన తర్వాత, 1930 లో జరిగిన యీ విషయం వ్రాస్తూ లక్ష్మీపతిగారు, ముఖ్యమంత్రి అయిన రాజాజీకి పిటీషన్ పెట్టుకున్నారు. డబ్బు విషయమై వచ్చిన ఏ కాగితమైనా ప్రప్రథమంగా త్రోసిపారవేయాలనే తన సూత్రప్రకారం ఆయన దానిని త్రోసిపుచ్చారు. ఆ నిరాకరణ అయిన తర్వాత లక్ష్మీపతిగారు జరిగింది చెప్పడానికి ప్రకాశంగారి దగ్గరకు వచ్చారు. వారి దగ్గర పిటీషన్ పుచ్చుకొని ఫైలు తెప్పించారు. నేను మీద వ్రాసిన ఉదంతం ఆ ఫైలు చదివితే తెలిసింది. ఇది శుద్ధ అన్యాయమని, లక్ష్మీపతిగారికి ఆ ఏడువేలు మంజూరు చేయాలని ప్రకాశంగారు గట్టిగా వ్రాశారు. రాజాజీ ఇదివర కొకసారి నిరాకరించడం చేత ఫైనాన్సు డిపార్టుమెంటువారు ఆ కాగితం ఆర్థికమంత్రి అయిన రాజాజీ దగ్గరకు వెళ్ళకుండా ఆ కోరికను నిరాకరించి కాగితం వెనక్కు తిరిగి పంపించేశారు. దాని మీద ప్రకాశంగారు మరీ తీవ్రంగా వ్రాశారు. నేను ఆ ఫైలు పుచ్చుకొని రాజాజీ దగ్గరికి వెళ్ళి, "ఎవరైనా డబ్బు అడిగితే ఆలోచించకుండానే నిరాకరించవలసిందని మీ ప్రథమ సూత్రం చెప్పారు. కోరినవారు పిటిషను పెట్టుకుంటే వారిలో కొంత ఆసక్తి ఉందని అనుకుని అపుడు పునరాలోచన చేయవచ్చు అని నాకు మీరు ఇదివరలో పాఠం చెప్పారు," అన్నాను. దానికి, "ఎవరి విషయమై అంటున్నా"వని ఆయన అడిగారు.

ఇది డాక్టర్ లక్ష్మీపతిగారి కేసు అన్నాను. ఎప్పుడో ఏడు సంవత్సరాలనాటి డబ్బు ఎలా ఇమ్మంటావని ప్రశ్నించారు. అపుడు ఆ కాగితాలు తీసి, "ఆ విషయంతో ఏమీ సంబంధంలేని డిస్పాచ్ గుమాస్తా పంపిన మెమోపైని రాజకీయ కారణంచేత ఆ డబ్బు ఇవ్వడం