పుట:Naajeevitayatrat021599mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాట్లాడే టంత గోరోజనం వుండేది. చివరికి హనుమంతరావు నాయుడుగారు కూడా నన్ను అదిలించలేని స్థితి వచ్చేసింది. ఈ స్థితిలోనే 1891 వేసవికాలంలో కాకినాడలో కొందరు నాట్యకళాభిమానుల కోరికమీద నాటకా లాడడానికి అంగీకరించి అక్కడ మకాము వేశాము. అప్పట్లో కాకినాడలో కూడా తాలింఖానాలూ, వాటికి సంబంధించిన గంద్రగోళాలూ చాలా హెచ్చుగా వుండేవి.

సింగితపు అబ్బాయి అనే వేపారిపంతులు ఈ తాలింఖానాలకీ, అందులోని వస్తాదులకీ గురువు. మనిషి మంచి ఆజాను బాహువు; అప్పటికే అతనికి 50 ఏళ్ళు పైగా వుండేవి; మీసాలు, కనుబొమ్మలు నెరిసిపోయి వుండేవి; పెద్ద బొజ్జకూడా వుండేది. కాని, మనిషి మంచి భీకరంగా వుండేవాడు. వృత్తి ఆయుర్వేదవైద్యం. అప్పట్లో పెద్దవాళ్ళందరితోనూ ఆయనకి వైద్యసంబంధం వుండేది. ఆయన పెద్దవాళ్ళలో పెద్దవాడు; రౌడీలలో రౌడీ! ఆ కాలపు కాకినాడ చరిత్రలో ఆయన ముఖ్యపాత్రధారి. సామాన్యంగా నాటకాలకి ఇల్లాంటి పలుకుబడిగల బలశాలుల సాహాయ్యం ఎప్పుడూ అవసరమే. ఆ రోజుల్లో నాటకాల శాంతి భద్రతలు ముఖ్యంగా వాళ్ళమీద ఆధారపడి వుండేవి. ఆనాటి కాకినాడలో ఏ కసరత్‌చేసినా, కర్ర తిప్పినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన శిష్యుడు అయి తీరాలి!

అందులో తాడి వెంకటరత్నం, ముమ్మడి వెంకటరత్నం, బావాజీ మొదలయిన ముఖ్యులు బాగా ప్రఖ్యాతి సంపాదించారు. ఆ తాడి వెంకటరత్నం మరీ ఒడ్డూ పొడుగూ, కండపుష్టీ ఉన్నమనిషి. మా హనుమంతరావునాయుడుగారు ఈ మనిషి ఒడ్డూ పొడుగూ చూసి నాటకం బందోబస్తుకి ఇతన్నీ, ముమ్మడి వెంకటరత్నాన్నీ, బావాజీనీ దగ్గిరకి జేర్చుకున్నారు. అంటే వాళ్ళకి నాటకాలకి ఫ్రీటిక్కెట్లు ఇచ్చి గౌరవించారన్నమాట. మా నాయుడుగారు ఆ తాడి వెంకటరత్నాన్ని చూసి ఆయన బలశాలి అనీ, ధైర్యవంతుడనీ అపోహపడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ శాండోల బలం నమ్ముకుని నాయుడుగారు అబ్బాయి తోడ్పాటు ఆశించలేదు. ఒకటి రెండు నాటకాలు అయ్యాక