పుట:Naajeevitayatrat021599mbp.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందుకు రాజాజీ "ఇది నీ వరకు కూడా వచ్చిందా? నువ్వు విశాఖపట్నం వాడివి. శొంఠి రామమూర్తీ విశాఖపట్నంవాడు. నువ్వు అతని విషయమై చెబితే కొంత అర్థముంది. కాని, నాకు ఇదివరకే పది పదిహేను మంది అప్పుడే సిఫార్సు చేశారు. అతడు ఒట్టి పొలిటికల ప్రోపగాండిస్ట్ (రాజకీయ దృష్టిగల ప్రచారకుడు) అటువంటి వారిని పెద్ద ఉద్యోగాలలో వేసుకుంటే నా మాట సాగుతుందా? మంత్రిమాట సాగుతుందా?" అన్నారు. రాజాజీ యీ మాటలు కనువిప్పు అయితే అర్హు డెవడైనా అణగద్రొక్క బడితే అతని విషయం ఎవరైనా ప్రభుత్వానికి చెప్పవచ్చునా? కూడదా? అన్నది మాత్రం ముఖ్యమైన ప్రశ్న. చెబితే ఉద్యోగిని, ప్రోపగాండిస్ట్ అంటారు. చెప్పకపోతే అడుగున పడిపోతాడు. ప్రకాశంగారు పట్టుపట్టడంవల్ల, బోర్డ్ ఆఫ్ రెవిన్యూ సభ్యుల సంఖ్య హెచ్చించి, శొంఠి రామమూర్తిగారిని అందులో సభ్యునిగా నియమించక తప్పలేదు. రాజాజీకి - విద్యావిధానంలో కూడా, పాత సంప్రదాయాలపైన నూతనమైన విజ్ఞాన విధానమును రూపొందించడానికి ప్రకాశంగారు ఒక స్కీమును తయారు చేశారు. అయితే, అదికూడా రెవిన్యూకు సంబంధించకపోవడంచేత సచివాలయంవారు వెనక్కు త్రోసి వేశారు. మొదటి మంత్రివర్గం చేసిన పనులలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి - మద్యపాన నిషేద చట్టము, దానివల్ల ప్రభుత్వానికి తగ్గిపోయే రాబడిని పూరించేందుకుగాను సేల్స్‌టాక్సు విధించే శాసనము, దేవాలయాలలోనికి హరిజనులకు ప్రవేశాధికార మిచ్చిన శాసనము.

మద్యపాన నిషేధం బిల్లుకు కాంగ్రెసేతర సభ్యులనుంచి ప్రతికూలత ఉండేది. చాలా పత్రికలలో కూడా యిది జయప్రదం కానేరదనే శాసవాచకాలు రోజూ వ్రాయబడుతూండేవి. మద్యనిషేధ మన్నది ఎంత గొప్ప ఉద్యమమో అంత దురదృష్టోపహతమైనది. పాశ్చాత్య దేశాలలో కూడా ఆవేశంతో ప్రవేశపెట్టబడి, ఆశాభంగంతో ఉపసంహరింపబడడమే ఈ మద్యనిషేధ ఉద్యమపు సంక్షిప్త చరిత్ర. అదే మన దేశంలో కూడా చేస్తున్నాము.