పుట:Naajeevitayatrat021599mbp.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీద ప్రతిబింబిస్తున్న సూర్యబింబం, ఆ క్రిందటి ఏడు ఎండిపోయి ఉన్న పొలాలే ఈ ఏడు సస్య సంపూర్ణమై పచ్చగా హృదయానందకరంగా కనిపించాయి. రైతులను "మీ కెంత ఖర్చయిం" దని అడిగితే, ఏ డెనిమిది వేలయిం దన్నారు. ప్రక్కన్నున్న ఇంజనీరును, "మీరు పని చేయిస్తే ఎంతవుతుందయ్యా?" అని ప్రశ్నిస్తే, తమ ఎస్టిమేటు ప్రకారం లక్షకన్న హెచ్చుకాక తప్పదని చెప్పారు. పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఏ విధంగా పబ్లిక్ వేస్ట్ డిపార్టుమెంట్‌గా పరిణమిస్తున్నదో సూచించడానికి ఇంతకన్న వేరే తార్కాణం ఏం కావాలి?

ఇది ఇలా ఉండగా ప్రకాశంగారికి ముఖ్యమంత్రితో అనేక సమయాలలో భేదాభిప్రాయాలు సహజంగా వస్తూనే ఉండేవి. బోర్డ్ ఆఫ్ రెవిన్యూలో ఒక సభ్యుడుగా శొంఠి రామమూర్తిగారిని వేయవలసిందని ప్రకాశంగారు కోరగా, ఎంత మాత్రమూ వీలులేదని రాజాజీ కొంతకాలం నిరాకరించారు. అంతకు పూర్వం సేలం జిల్లాలో మద్యనిషేద శాసనం అమలుచేసే నాటికి శొంఠి రామమూర్తిగారు అక్కడ కలెక్టరు. అక్కడ అతనిని కాదని ఒక ఇంగ్లీషు ఐ. సి. యస్. ఉద్యోగిని మద్యనిషేధం అమలుపరచడానికి నియమించారు. ఇలా ఉండేటపుడు, నేనూ రాజాజీ ఒకే మోటారుకారులో సేలం వెళ్ళడం తటస్థించింది. ఆయన ఒకప్పుడు విశాఖపట్నం వచ్చి మా యింట్లో అతిథిగా ఉండడంచేతా, శాసన సభలో ప్రశ్నోత్తర సమయాలలో ప్రకాశం గారి వంతును నేను నడిపించే విధానం బాగుందని ఆయన మెచ్చుకుంటున్నాడనే విశ్వాసంచేతా, చనువుచేతా శొంఠి రామమూర్తిగారి విషయమై ఆయనను "సేలం జిల్లాలో, సద్గుణ వంతుడయిన హిందూ ఐ. సి. యస్. ను వదిలిపెట్టి, మద్యనిషేధంలో నమ్మకంలేని ఇంగ్లీషు ఐ. సి. యస్. ఉద్యోగిని వేయడం ఏమీ బాగాలేదు. అంతే కాకుండా, బోర్డు ఆఫ్ రెవిన్యూ మెంబరుగా ఉండడానికి అర్హతగల తెలుగు ఉద్యోగిని వెనుకకు నెట్టడం ఎందుచేత జరిగింది?" అని ప్రశ్నించాను.