పుట:Naajeevitayatrat021599mbp.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టుకొనేందుకు కూడా అవకాశం ఉండేది. శాసన సభకు కావలసిన ఏర్పాటు చేశారు.

గవర్నరులు కేవలం కాన్ట్సిట్యూషనల్ గవర్నర్లుగానే ఉంటామని మాట ఇచ్చిన తరువాత కాంగ్రెసు మంత్రివర్గాలు ఏర్పడినట్లు లోగడ వ్రాసియున్నాను.

శాసన సభ ప్రథమ సమావేశము

14 - 7 - 37 న సెనేటు హవుసులో శాసన సభా సమావేశం జరిగింది. ఆ మరునాడు శ్రీ బులుసు సాంబమూర్తిగారిని స్పీకరుగా ఎన్నుకొనడం జరిగింది. ఇదివరకు వ్రాసిన గవర్నమెంటు తీర్మానాలతో బాటు మరొక ముఖ్య విషయం చెప్పవలసి ఉంది. 31 - 8 - 37 న, అంటే ఉద్యోగ స్వీకరణ అయిన నెలా పదిహేను రోజులలో శాసన సభలో భారత దేశానికి స్వాతంత్ర్య ప్రాతిపదికపైన సంవిధానము (Constitution) తయారు చేయడానికి కాన్ట్సిట్యుయెంట్ అసెంబ్లీ (సంవిధాన సభ) ఏర్పాటు చేయవలసిందని బ్రిటిషు గవర్నమెంటును కోరడం ఆ తీర్మానపు సారాంశము. 1946 వరకు ఈ అసెంబ్లీ రాలేదు. అది వేరే విషయము.

వందేమాతరం ప్రార్థనతో సభారంభం

15 వ తేదీన స్పీకరుగా ఎన్నికయిన వెంటనే సాంబమూర్తిగారు సభ్యులకు తన కృతజ్ఞతను రెండే రెండు చిన్న వాక్యములలో చెప్పి, సభ్యులలో ఒకరైన శ్రీమతి లక్ష్మీశంకరయ్యర్‌గారిని "వందేమాతరం" పాడమని ఆదేశించారు. సభ్యులందరు లేచి నిల్చున్నారు. జస్టిస్‌పార్టీ వారు, ముస్లిం లీగ్‌వారు కూడా ఆ రోజున సందేహాభ్యంతర భావాలు చూపకుండా లేచి నిలుచున్నారు. అయితే, రానురాను కాంగ్రెస్‌వారు తమ జాతీయ గీతం క్రింద పాడుతూ ఉన్న గీతం పాడినప్పుడు తాము నిలిచినట్లయితే తమ పార్టీ గౌరవానికి లోటు కలుగుతుందనే భావం ఒకటి వారిలో వారే అంకురింపజేసికొని, దానిని కాంగ్రెసు విద్వేషం అనే విషంతో తడిపి, వ్యతిరేకత అనే ఒక చిన్న మొక్కను తమ