పుట:Naajeevitayatrat021599mbp.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరిగీ మొదట చెప్పిందే మరింత విపులంగా, గట్టిగా చెప్పాను. ముఖ్యమంత్రిగారికి కోపం, అసంతృప్తి కలిగినట్లు నాకు కన్పించింది.

తిరిగి ఆయన నాతో, ఈ మారు సప్లిమెంటరీ ప్రశ్నకు జవాబులో మాట మార్చి తాను చెప్పినట్లు చెప్పవలసిందన్నారు. దానిపై నేను "మీరు మామాలుగా చేసే పద్ధతిలో నిల్చొని, ఆ జవాబు మీకు ఉచితమని తోస్తే మార్చివేయండి," అన్నాను.

నేను నిలిచింది ప్రకాశంగారి తరపున గనుక, ముఖ్యమంత్రిగారు చొరవచేసి జవాబు మార్చరని నాకు లోపల ఒక విశ్వాసం ఉండే అలా చెప్పాను. ఆయన మరి మాట్లాడలేదు. అది అప్పటికి ఆగిపోలేదు. మరికొంత సేపయిన తర్వాత ముఖ్యమంత్రిగారు చటుక్కున నా వైపు తిరిగి, జవాబులు ప్రొసీడింగ్స్‌లో (అంటే - శాసన సభలో జరిగే ఉత్తర ప్రత్యుత్తర, సంభాషణ, ఉపన్యాసముల యథాతథమైన రిపోర్టు) సరిదిద్దవలసిందని చెప్పారు. నేను అలా కుదిరే వ్యవహారం కాదని నిష్కర్షంగా, మర్యాదగా, మెల్లగ ఆయనకు చెప్పేసరికి, ఆయన ఇంగ్లీషులో "యూ ఆర్ ఇన్‌కారిజిబుల్ (you are incorrigible) అన్నారు. ఈ విషయాలు నేను ప్రకాశంగారికి చెప్పలేదు. అప్పటికే ఇద్దరి మధ్య వైషమ్యాలు హెచ్చుగా ఉన్నపుడు అగ్గిమీద గుగ్గిలం వేసినట్టు, ఈ విషయం చెప్పడం ఎందుకని నేను ఊరుకొన్నాను.

శాసన సభలో చర్చ వచ్చేనాటికి నివేదిక అంతా సభ్యులు చదివి ఉండడంవల్ల, జన బాహుళ్యానికి కూడా నివేదిక యథాతథంగా తెలియడంవల్ల వాతావరణంలో ఒక బ్రహ్మాండమైన నవ్యత్వం ఆవిర్భవించింది. ప్రకాశంగారు కేవలం తాను పట్టిందే పట్టు అనే మనిషి అన్న అపప్రథకూడా తగ్గింది. పాత రికార్డులు, పెర్మనెంటు సెటిల్మెంటు నాటి గవర్నమెంటు వాగ్దానాలు, వివాదాలు పరిష్కారం చేసే సమయంలో లోగడ రెవిన్యూ మెంబర్లు ఇచ్చిన ఉపన్యాసభాగాలు అందరికీ తెలిసేసరికి, ఇదివరకు అభ్యంతరం పెడుతున్నవారి సానుభూతి చాలమటుకు ప్రకాశంగారియెడల దినదినాభివృద్ధిగా పెరిగింది. శాసన సభలో ఈ నివేదిక చర్చ జరిగే జనవరి 20 వ తేదీ ఒక పర్వదినంవలె కన్పిం