పుట:Naajeevitayatrat021599mbp.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీని తరువాత ఘట్టం ఇంకా విచిత్రంగా జరిగింది. కమిటీ మెంబర్ల సంతకాలయిన వెంటనే, రిపోర్టు పూర్తిగా అచ్చుకావడానికి టైము చూచుకొని ఏదో తేదీని నిర్ణయించి, ఆ తేదీన శాసన సభలో నివేదిక అంద జేయడానికి నోటీసులను ఇవ్వడం జరిగింది. ఎజెండాలో ఈ విషయంకూడా అచ్చయింది. ఆ ఉదయం స్పీకరు సాంబమూర్తిగారు నాకు టెలిపోనుచేసి, తమను అర్జంటుగా వచ్చి చూడమని చెప్పారు. నేను వెళ్ళగానే, తమకు, గవర్నరుకు జరిగిన సంభాషణ సారాంశం చెప్పారు. గవర్నరుగారు ఫోనుచేసి స్పీకరును ఒకమారు కలుసుకో వాలన్నారు. స్పీకరు నాటి సెషను కాగానే కలుసు కుంటాననగా గవర్నరు అంతకుముందే కలుసుకోవలె నన్నారట. విషయమేమని స్పీకరు అడగగా, గవర్నరుగారు కమిటీ రిపోర్టు శాసన సభకు ఆరోజుకు అందజేయకుండా ఆ విషయం వాయిదా వేయరాదా అన్నారట. కాన్స్టిట్యూషనల్ గవర్నరు అయిన ఎల్‌స్కిన్ ప్రభువు ఆ విధంగా స్పీకరును కోరడం అన్నది చాలా అసందర్భము. ఆ మాట అలా ఉంచండి. ఆయన ఎందుకలా కోరారు? గవర్నమెంటు వారు ముందుగా ఆలోచించ కుండా, ఒక నిర్ణయానికి రాకుండా సభకు నివేదికను అందజేయడం మంచిది కాదుకదా అన్నది గవర్నరు అభిప్రాయము. దానిమీద సాంబమూర్తి గారు మాట తప్పించి, గవర్నరు ముఖ్యమంత్రితో ఈ విషయం మాట్లాడారా అని ప్రశ్నించారట. గవర్నరు ఫోనులోనే నవ్వి, "అది మీరు ఎలా కనిపెట్టా"రని అడిగారట. దానిపైన సాంబమూర్తిగారు గవర్నరు కోరినట్లే ముఖ్యమంత్రికూడా కోరి, తనతో అవే మాటలను అన్నట్టు గవర్నరు చెప్పారట. దానిపై తెలివైన న్యాయవాదులైన సాంబమూర్తిగారు ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయకూడదా అని గవర్నరు అంటే, సాంబమూర్తిగారు - అది ఎంత మాత్రం వీలుపడదనీ, శాసన సభ నియమించిన సంఘం నివేదికను శాసన సభకే అందజేయాలి కాని, గవర్నమెంటు కిచ్చే వీలులేదనీ, ఎజెండా పత్రికలలో వచ్చిన తరువాత దావాయి వేస్తే కొంపలు అంటు