పుట:Naajeevitayatrat021599mbp.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందర్భంలోను, రైతుల దగ్గిర సిస్తులు పెంచి వసూలు చేయవచ్చునా కూడదా అన్న విషయంలోనూ జమీందారులు మొదట్లో సవ్యమైన పద్దతిలో వెళ్ళినట్లు కనిపించదు. ధనాశ చూపించి పెద్ద ఉద్యోగులను గవర్నరుతో సహా - తమకు అట్టి హక్కులు సంక్రమించినవన్న వాదం బలపరచుకొనేలాగున వారు చేసికొన్నారు. రైతులలో ఆందోళన బయలుదేరింది. ఇది ఈస్టిండియా కంపెనీ డైరక్టర్లకు తెలిసి, ఈ విషయంగా రహస్యంగా పరిశీలించడానికి ఒక సంఘాన్ని వేయడం జరిగింది. ఆ పరిశీలన ఫలితంగా ఆనాటి చెన్నరాష్ట్ర గవర్నరును ఉద్యోగంనుంచి తప్పించడంకూడా జరిగింది.

ఇంతేకాక, మొదట్లోఉన్న రెగ్యులేషన్స్ (శాసనాల) ప్రకారం సిస్తులు హెచ్చించడానికి జమీందార్లకు హక్కులేదు అనే విధి ఉండెను. దీనికి సంధించిన కాగితాలను ప్రకాశంగారి ముందు సేకరించి పెట్టగా, ఆయన జమీందారీలను తక్షణం రద్దు చేయాలన్న ప్రతిపాదనపై ఉన్న దృష్టి మరల్చుకొని, అన్ని జమీందారీలతో ఉన్న సిస్తురేట్లు 1802 నాటి రేట్లకు దించివేయాలనే అభిప్రాయం గట్టిగా ఆయనకు కలిగినది. అయితే, 1858 - 1908 లలో చేసిన శాసనం ప్రకారంగా ఆనాటి రేట్లు స్థిరపరుపబడి, ఇరవై సంవత్సరాలకొకసారి దినుసులు ఖరీదులు జాస్తి అయినట్లయితే రూపాయకు రెండు అణాలు రెవిన్యూ కోర్టులో పిటీషనులువేసి హెచ్చు చేయించుకొనే హక్కు ఇవ్వబడింది. ఇలాంటి పరిస్థితులలో 1802 రేట్లు పునరుద్దరించడం ఎలాగన్న శంక మెంబర్లకు కమిటీ సభ్యులకు, వృత్తిచేస్తూన్న లాయర్లకు కలిగింది. 1908 శాసనాలు తప్పయినట్లయితే వాటిని ఎందుకు సవరించకూడదు? రైతులకు మేలు ఎందుకు చేయకూడదు? అని ప్రకాశంగారి వాదన.

ఎలాగైతే నేమి, కమిటీ సభ్యులలో కాంగ్రెసు వారందరు - ప్రకాశంగారు కాక, మిగతా అయిదుగురు, రిపోర్టును ఆమోదించి సంతకాలు పెట్టారు. జమీందారు మెంబరు, జస్టిస్‌పార్టీ మెంబరు, ముస్లిం లీగు మెంబరు ఇది కాదని వారి వ్యతిరేకతను ప్రత్యేకంగా వ్రాసుకొన్నారు.