పుట:Naajeevitayatrat021599mbp.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మించవనీ; అలా కాకపోయినా ముఖ్యమంత్రిగారు ప్రకాశంగారికి విముఖులు గనుక ప్రకాశంగారిని అడ్డవలసిన విధంగా అడ్డగలరనీ - జమీందారులూ, వారి న్యాయవాదులూ, వారి మిత్రులూ, వారికి మిత్రులైన శాసన సభ సభ్యులూ చెప్పుకుంటూ ఉండేవారు. ఈ అభిప్రాయ భేద కల్లోలాలలో ప్రకాశంగారు మాత్రం తాను వ్రాయవలసింది వ్రాసుకొంటూ, మౌనదీక్ష వహించి, దూషణ భూషణలకు అతీతులై ఉండేవారు.

అయితే, జమీందారులంతా కలసి పెద్ద ప్రయత్నం చేయడానికి తలపెట్టి, తమలో తాము చందాలుకూడా వేసికొని, శ్రీ కె. ఎం. మున్షీ గారిని ఒక లక్షరూపాయల ఫీజుమీద తమ సలహాదారుగా నియమించి, వల్లభాయ్ పటేలుగారి దగ్గరకు తమ తరపున విజ్ఞప్తిచేయడానికి పంపించారు. శ్రీ మున్షీ కాంగ్రెసు నీతిప్రకారం జమీందారీ పద్ధతి రద్దు చేయడానికి వ్యతిరేకంగా వెళ్ళడం సమంజసం కాదని మేమంతా అభిప్రాయపడ్డాము. ఎందుచేతనంటే - ఆ రోజులలో ఆయన అఖిల భారత కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో సభ్యుడుగానూ కాంగ్రెసుకు సన్నిహితుడుగాను ఉండేవాడు.

ఈ లోపున రిపోర్టు పూర్తిచేయడం జరిగింది. కాని, మెంబర్లు అందరి సంతకాలు కావడానికి, ప్రకాశంగారు వ్రాసిన అభిప్రాయాలతో ఏకీభవించేటట్లు చేయడానికి రెండు మూడుమార్లు అంతా సమావేశం కావలసి వచ్చింది. ఇందులో ముఖ్యంగా అభ్యంతరకరం అనిపించిన విషయం - జమీందారీల రద్దుమాట అట్టేపెట్టి, ప్రప్రథమంలో 1802 లో, అనగా పెర్మనెంటు సెటిల్మెంటు జరిగిన నాటి సిస్తులకు సిస్తురేట్లు అన్నీ తగ్గించవలసినదని ఉత్తర పూర్వపక్షాలు విమర్శచేసిన ప్రకాశంగారి సిద్దాంతము. సిస్తులు హెచ్చు చేయవచ్చునా కూడదా అనే విషయం గురించి పెర్మనెంటు సెటిల్మెంటు అయిన తర్వాత రెండు మూడు పర్యాయాలు గవర్నమెంట్ బోర్డు ఆఫ్ రెవిన్యూవారు ఆలోచించారు. అయితే, కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఏర్పడినవి. పేష్‌కష్ అనగా - జమీందారు ఏటేటా ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తం నిర్ణయించే