పుట:Naajeevitayatrat021599mbp.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జమీందారీల సమస్య

మంత్రివర్గం ఏర్పాటైన రెండు నెలలలో జమీందారీల విషయమై దర్యాప్తు సమస్య ఉద్భవించింది. ఒక రోజున, రాజమహేంద్రవరం కాంపులో ప్రకాశంగారూ, నేనూ ఉండగా, కాండ్రేగుల జమీందారుగారు ప్రకాశంగారిని చూడడానికి వచ్చారు. ఆయన చాలా చిన్న జమీందారు. స్వాతంత్ర్యోద్యమంలో రహస్యంగానో, బహిరంగంగానో కాంగ్రెసు నాయకులకు సాయం చేస్తూండేవాడు. ఆయన కున్నది నీటి తగవు. ఆయన వెళ్ళిన తరువాత ఆయన తాలూకా రైతులు గుంపుగా వచ్చి ప్రకాశంగారిని చూశారు. వారూ ఆ నీటి తగవుకోసమే వచ్చారు. వారు ఫిర్యాదు చేసింది జమీందారుపై. జమీందారుగారు ఫిర్యాదు చేసింది ప్రభుత్వం పైన. ఇవి రెండూ ఒకే నీటి వనరును గూర్చినవి. సాయంకాలం ప్రకాశంగారూ, నేనూ చల్లగాలికోసం నడుస్తూన్న సమయంలో ఈ జమీందారు ప్రసంగం వచ్చింది. అప్పుడు నేను ప్రకాశంగారితో ఇలా అన్నాను: "మన రాష్ట్రంలో జమీందారీ రైతులకు ఆక్యుపెన్సీ రైటు (సాగు హక్కు), ఆ హక్కును వారసత్వం క్రింద పొందగలిగే హక్కు, విక్రయించగలిగే హక్కు ఉండడంచేత 1908 నుంచి కొంత స్ఢిమితం కలిగింది. అయితే, ముఖ్యమైన ఇబ్బంది నీటి విషయమైనదే.

"నీటి వనరులు - నదులు మొదలైనవి - జమీందారీ, ప్రభుత్వానివి, ఇనాముదారీ అనే మూడు రకాలైన భూముల గుండా ప్రవహిస్తాయి. ఈ భూముల విస్థీర్ణాన్నిబట్టి తగాదాలు హెచ్చినవి. అంతకు పదిహేను పదహారు సంవత్సరాల క్రితం ఉర్లాము జమీందారీలో గల నీటి హక్కుల విషయమై వచ్చిన ప్రివీ కౌన్సిల్ తీర్పువల్ల లేనిపోని చిక్కులు కలిగి, రైతులు బాధపడుతున్నారు. ఆ తీర్పులో, నదికి రెండు ప్రక్కల జమీందారీ భూములు న్నట్లయితే అంతమటుకు జమీందారే నదికి స్వామి అన్నారు. అదే విధంగా ఇనాము భూములున్నట్లయితే ఇనాముదారే నదీస్వామి అన్నారు. రెండు ప్రక్కల ప్రభుత్వపు భూములు - అంటే రైత్వారీ భూములు - ఉంటే అంత