పుట:Naajeevitayatrat021599mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వినా, మెట్రిక్యులేషన్ దండయాత్రలు చెయ్యడంవల్ల మేము అతన్ని కలుసుకున్నాము. వాళ్ళు నాకిప్పటికీ జ్ఞాపకం వుండడానికి కారణం నాకు వాళ్లయింట్లో వుండే చనువు. నేను వాళ్ళతో పాటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లాడిలాగే మెలుగుతూ వుండేవాణ్ణి. నాటకాలు చూసి అర్థరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా, వాళ్ళ ఇంట్లోనే పడుకుని వాళ్ళతో కలిసి తెల్లవారకుండా వంట ఇంట్లో చల్ది అన్నము తింటూ వుండేవాణ్ణి. మెట్రిక్యులేషన్ లో శంకరాన్ని "గుబ్బక్" అని పిలిచే వాళ్ళము. మెట్రిక్యులేషన్ పాసయ్యాకా అతను ఎక్కడా అడ్డు లేకుండా పరీక్షలు పాసయి, ప్లీడరు అయ్యాడు. మళ్ళీ ప్లీడరీకి చదివినప్పుడు మేమిద్దరమూ కలిసి చదివామేమో అనుకుంటాను.

ఇక నా జీవితంలో అత్యంత సన్నిహిత మిత్రుడూ, నాకు అన్ని విధాల సహాయం చేసిన ఆప్తుడూ, నా రాజకీయా లెల్లా ఉన్నా నన్నాదరించిన ఆత్మీయుడూ అయిన కంచుమర్తి రామచంద్రరావు, నేను 5 వక్లాసు చదివినప్పటి నుంచి నా సహాధ్యాయిగా వుండేవాడు. పాపం! చదువులో అతను సామాన్యంగా ఉండేవాడు; పరీక్షలో మార్కులు వచ్చేవి కావు. అతను చాలా విశాలహృదయుడు; ప్రేమ పాత్రుడు. చదువుకునే రోజుల్లోనే నాకు స్వల్పంగా కావలసిన ధనసాహాయ్యమూ అదీ చేస్తూ ఉండేవాడు. క్రమంగా మేమిద్దరమూ చాలా జోస్తీగా తిరిగేవాళ్ళము. తరవాత జీవితంలో కూడా నాకతను చేసిన సాహాయ్యం ఎన్నడూ మరవలేను. నేను బారిష్టరునై, డబ్బు గణించి, ఖర్చుచేసి, ఏదో కొంత పెద్దరికం సంపాదించగలిగా నంటే దానికి అతనే ముఖ్యకారణమని చెప్పాలి. ముందు ముందు ఆ విషయాలు వ్రాయవలసివచ్చినప్పుడు ఇంకా వివరిస్తాను. మాకు ఇటీవలి జీవితంలో రాజకీయాల్లో ఎన్నో అభిప్రాయభేదాలు కలిగాయి. కాని, మా హృదయాల్లో అనురాగం మాత్రం ఇనుమడించింది. కాని, అణువంతైనా చలించలేదు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీపట్టుదలకోసం ప్రతికూలపక్షంలో పనిచేస్తున్నా, అతను నాకు అవసరమైన సహాయం కూడా చేస్తూ ఉండే