పుట:Naajeevitayatrat021599mbp.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొట్టాలు ప్రెషర్‌మెయిన్స్ - అంటే, నీటి ప్రవాహం జోరుకు ఆగవని అనుభవం వల్ల తెలిసిన విషయము. పుస్తకాలలో చెప్పిన ప్రకారం తయారయితే వాటికి తగిన బలం ఉండవచ్చుకాని, ఆ విధంగా పని జరగదు. భార్యపేర ఒక సిమెంటు పైపుల కంపెనీలో ఆయనకు కొన్ని షేర్లు ఉండేవి. ఇదికాక, మేఘాద్రి గడ్డనుంచి మంచినీరు తీసుకురావాలని ఆయన స్కీము. ఆ నీరు వర్షాకాలంలో తప్ప, తక్కినప్పుడు ఉప్పగాను, చప్పగాను ఉంటుంది గనుక, ఆ స్కీము పనికి రాదనీ, గోస్తనీ నీరు తీసుకురావాలని నా వాదము. చైర్మన్ ఆయన స్నేహితుడు కావడంచేత, మేఘాద్రి గడ్డ స్కీమే అప్పటికే ఖాయమయింది. ఆ నూతిలోంచి వచ్చిన నీరు ఇప్పటికీ చప్పగాను, వేసవిలో ఉప్పగానూ ఉంటుంది. తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత గోస్తనీ స్కీము, తత్పూర్వం యుద్ధకాలంలో మిలటరీవారు చేసిన యత్నపూర్వకంగా విశాఖపట్నానికి ప్రాప్తించింది. ఆ నీరు బాగా రుచిగాను, ఆరోగ్యకరంగాను, మృదుత్వం కలిగిఉన్నదన్నది అందరికీ అనుభవ వేద్యమైన విషయము.


సరే, అది అలా ఉంచండి. రాష్ట్రంలో అనేకచోట్ల ఇటువంటి సంబంధాలు కల్పించుకోవడంవల్ల, ఆయనకు అంత మంచి పేరుండేది కాదు. అప్పట్లో పబ్లికు హెల్తు మంత్రి అయిన టి. ఎస్. ఎస్. రాజన్ ఈయనను ఎలాగైనా తప్పించివేయాలని పట్టుపట్టాడు. దీనికితోడు, జి. వి. రావు క్రింద పనిచేసే ఒక డిప్యూటి చీఫ్ ఇంజనీరు చాలా తెలివైనవాడు. శానిటరీ ఇంజనీరింగులో పెద్ద విదేశ డిగ్రీలు పొందిన వాడు. పైగా, ఆయన మంత్రులతో స్నేహంగల వ్యక్తి. చీఫ్ శానిటరీ ఇంజనీరు పైన చాడీలు చెప్పడం కూడా ఆయనకు మామూలు. ఇటువంటి పరిస్థితులలో జి. వి. రావు పైన ముప్పైరెండు, ముప్పైమూడు నేరముల ఆరోపణలుగల ఛార్జీ షీటు ఒకటి ఆయనకు ఇవ్వడం జరిగింది. జి. వి. రావు ఇతర స్నేహితుల ద్వారా ప్రకాశంగారి దగ్గర మొర పెట్టుకొన్నాడు. ప్రకాశంగారు ఫైలు తెప్పించారు. "చాలా గ్రంథం పెరిగిపోయింది," అని నన్ను చూడ మన్నారు. అపుడు నేను